-

ఎమ్మెల్యేల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

28 Apr, 2015 02:28 IST|Sakshi
ఎమ్మెల్యేల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రోజుకో ప్రకటన, పూటకో హామీతో వంచన
విదేశీ పర్యటనలతో సాధించింది శూన్యం
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం
 

 పీలేరు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల వ్యవస్థను నిర్వీర్యం చేశారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రోజుకో ప్రకటన, పూటకో జీవోతో రాష్ట్ర ప్రజలను ఇంకా సీఎం చంద్రబాబు వంచిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదన్నారు. చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది శాసన సభ్యులున్నారన్న అక్కసుతో నిధులు మంజూరు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిధులు మంజూరుచేసినా చేయకపోయినా తాము నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామన్నారు.

సీఎం ఈ జిల్లా వాసిగా ఉండి ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు కోటి ఆశలతో ఎదురు చూశారని, అయితే వారి ఆశలను సీఎం ఉసూరుమనిపించారని అన్నారు. అధికార యంత్రాంగం ఏపనీ చేయకుండా చేతులెత్తేసిందని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన హామీలను అప్పటికప్పుడే అమలు చేశారని, అయితే బాబు చేసిన సంతకాలకు దిక్కు లేదని విమర్శించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం బాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు.

మరిన్ని వార్తలు