మెకాన్‌ తుది నివేదిక తరువాతే ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన

29 Jun, 2018 04:34 IST|Sakshi

రాయితీలపై పూర్తి సమాచారం ఆ సంస్థకు ఇవ్వండి

టీడీపీ ఎంపీలకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: మెకాన్‌ సంస్థ ముసాయిదా నివేదిన సమర్పించిన తరువాతే వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై తదుపరి ప్రకటన చేయగలుగుతామని, అప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు గురువారం కూడా కేంద్ర మంత్రిని కలసి ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి, ముడిసరుకు సరఫరాపై వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి ఒక్కరే విడిగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై మెకాన్‌కు పూర్తి సమాచారం ఇవ్వాలని టీడీపీ ఎంపీలకు సూచించానన్నారు. సదురు సంస్థ ముసాయిదా నివేదిక సమర్పించిన అనంతరం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశమై చర్చించాక తదుపరి ప్రకటన చేయగలుగుతామన్నారు.

ప్లాంట్‌ ఏర్పాటుపై నాలుగేళ్లుగా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందన్న టీడీపీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయాలనుకుంటే ఇన్నిసార్లు కమిటీలు నియమించి ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన అవకాశాలపై ఎందుకు అధ్యయనం జరిపిస్తామని ఆయన ప్రశ్నించారు. ‘1966లో మా రాష్ట్రం (హరియాణా) ఏర్పడింది. ఇప్పటికి కూడా మా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. అలాంటిది నాలుగేళ్లకే ఏపీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పడం సరైందికాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు.

టీడీపీ ఎంపీల అభ్యర్థన మేరకు ఎంపీ రమేశ్‌తో కేంద్ర మంత్రి ఫోన్‌లో మాట్లాడి దీక్ష విరమించాలని సూచించారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఎకరం రూ. నాలుగు లక్షలకు ఇస్తామని, రైల్వేలైన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తామని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెకాన్‌కు ఇవ్వాలని ఆయన సూచించారన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 24 గంటల్లో మెకాన్‌కు వివరాలిస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కావాలని కోరగా ఆయన తిరస్కరించారంటూ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. అయితే ప్రధాని గురువారం ఉత్తరప్రదేశ్‌ పర్యటనకు వెళ్లారు.

మరిన్ని వార్తలు