ఓనమాలు దిద్దేదెలా?

9 Feb, 2014 03:47 IST|Sakshi

 మార్కాపురం, న్యూస్‌లైన్: అక్షరాభ్యాసాన చిన్నారులు ఓనమాలు దిద్దే మార్కాపురం పలకకు కష్టకాలం వచ్చింది. కంప్యూటర్ల రాక, నోటు పుస్తకాల వాడకం పెరగడంతో పదేళ్ల నుంచి క్రమంగా రాతి పలకల వాడకం తగ్గిపోతోంది. దీంతో ఆ పరిశ్రమలూ మూతపడుతున్నాయి. కొంతమంది వ్యాపారులు వాటిని డిజైన్ స్లేట్లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో విదేశాల నుంచి కూడా ఎగుమతి ఆర్డర్లు నిలిచిపోవడంతో పనులు దొరక్క  పలకల ఫ్యాక్టరీల నిర్వహణ యజమానులకు భారంగా మారింది.

 సవాలక్ష సమస్యలు
 క్వారీల నిర్వహణలో కోర్టు కేసులు, పెరిగిన విద్యుత్ చార్జీలు, కూలీల వేతనాలు వెరసి ఫ్యాక్టరీల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. 150 ఫ్యాక్టరీలకు గాను కేవలం 20 నుంచి 25 ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పలకల పరిశ్రమపై సుమారు 30 గ్రామాల్లోని 3 వేల మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. ఫ్యాక్టరీలు మూతపడటంతో నెల రోజుల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది.

 విస్తృత నిక్షేపాలు
 తర్లుపాడు, మార్కాపురం, దొనకొండ మండలాల్లో సుమారు 15 కిలోమీటర్లు మేర పలకల గనులు విస్తరించి ఉన్నాయి. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు, మేకలవారిపల్లె, చెన్నారెడ్డిపల్లె, తుమ్మలచెరువు, మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, రాయవరం, కందివారిపల్లె, గజ్జలకొండ, దొనకొండ మండలంలోని మంగినిపూడి తదితర గ్రామాల్లో పలకల గనులు ఎక్కువగా ఉన్నాయి. రోజూ సుమారు 3 వేల మంది కార్మికులు గనుల్లో పనిచేస్తుంటారు.
 మార్కాపురం పలకలకు గతంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది.

 ప్రస్తుతం  ఆదరణ తగ్గుతోంది. పలకల గనుల్లో విజయాగోల్డ్, మల్టీ కలర్, బ్లాక్, ఆటమ్ తదితర రకాల డిజైన్ స్లేట్లు వస్తుంటాయి. ఒక్కో గనిలో నెలకు 10 నుంచి 15 టన్నుల వరకు ముడిరాయిని బయటకు తీస్తారు. వీటిని ఫ్యాక్టరీలకు చేర్చి వివిధ సైజుల్లో కోత కోసి ప్యాక్‌చేసి విక్రయిస్తారు. ఈ డిజైన్ స్లేట్లను ఇంటి గోడలకు అందంగా అమర్చుకుంటారు. మార్కెట్‌లో విజయగోల్డ్ రకం టన్ను 20 వేలు, మల్టీకలర్ 10 వేలు, బ్లాక్ 40 వేలు, ఆటమ్ 20 వేల నుంచి *25 వేల వరకు విక్రయిస్తుంటారు. గనుల్లో పనిచేసే కార్మికులకు రోజుకు 200 కూలీ ఇస్తుంటారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలకల గనుల్లో కార్మికులు రాయిని యంత్రాల ద్వారా బయటకు పంపిస్తారు. సుమారు 70 నుంచి 100 అడుగుల లోతులోకి దిగి రాయిని బయటకు తెస్తుంటారు.  ఫ్యాక్టరీలు పనిచేస్తే కటింగ్ ఆపరేటర్లకు 165, క్యాలిబ్రేషన్ కార్మికులకు 100 ఇస్తారు.

 నిలిచిన ఆర్డర్లు
 ఢిల్లీ, చెన్నై, ముంబయి తదితర నగరాలతో పాటు శ్రీలంక, సింగపూర్, చైనా నుంచి డిజైన్ స్లేట్ల కోసం వస్తున్న ఆర్డర్లు నిలిచిపోయాయి. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నెల రోజుల పాటు గనుల్లో నీరు చేరి పనులు నిలిచిపోయాయి. దీంతో ఇటు పలకల ఫ్యాక్టరీల్లో, అటు పలకల గనుల్లో పనులు లేక కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక విలవిల్లాడిపోతున్నారు.

 ప్రభుత్వం చొరవ చూపాలి
 నెల రోజులుగా స్థానిక పారిశ్రామికవాడలో పనులు నిలిచిపోయాయి. సుమారు 3 వేల మంది కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కార్మికులు కుటుంబాలతో సహా వలసలు పోతున్నారు. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఆర్డర్లు వచ్చే విధంగా చూడాలి.  - రూబెన్, వర్కర్స్ యూనియన్ కార్యదర్శి

మరిన్ని వార్తలు