అదృష్టమంటే ఆయనదేనండి ...

7 Aug, 2014 13:29 IST|Sakshi
అదృష్టమంటే ఆయనదేనండి ...

అదేమి విచిత్రమో ...  ఒక్క బహిరంగ సభలో ప్రసంగించలేదు... ఎన్నికల ప్రచారంలో ఒక్కసారి కూడా పాల్గొనలేదు... అంతేందుకు ఒక్క ఓటరును కూడా తనకు ఓటు వేయండి అని  అడగలేదు. అయితే నక్క తోక తొక్కినట్లు ఆయన్ని మంత్రి పదవి వరించింది. దాంతో ఆయన అదృష్టం  వీల్ డిటర్జంట్ పౌడర్ యాడ్లో కనిపించే 'వీల్'లా గిరగిర తిరుగుతుంది. ఇంతకు ఎవరా అదృష్టవంతుడు అనుకుంటున్నారా ? ఆయనేనండి ప్రముఖ విద్యావేత్త, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ గారు. ఆయన ఏ సభలో సభ్యుడు కాడు అన్న విషయం తెలిసిందే. ఆయన త్వరలో  రాష్ట్ర శాసనమండలికి ఎన్నిక కానున్నారు... ఆ విషయం కూడా తెలిసిందే.

అయితే చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా నారాయణ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి (జూన్ 8వ తేదీ) మాంచీ ఊపు, ఉత్సాహంతో పని చేసుకుపోతున్నారు. ఎలా అంటే ఆయన తన సహచర మంత్రుల కంటే రేస్లో దూసుకు పోతున్నారు. అది ఆయన శాఖలో అనుకుంటే పప్పులో తప్పకుండా కాలేసినట్లు.... ఎలా అంటారా విషయంలోకి వద్దాం... బియాస్ సంఘటన జరిగిన వెంటనే అక్కడ వాలిపోయారు. సహాయక చర్యలు చేపట్టడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తానైనట్లు మసలుకున్నారు. అంతేందుకు రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో శివరామకృష్ణన్ కమిటీతోపాటు ... రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ దేశ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు.

ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణ గారి 'పనితనం' కొండవీటి చాంతాడంతా జాబితా తయారవుతుంది. అయితే నిన్న కాక మొన్న వచ్చిన నారాయణ గారు .... ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని తానైనట్లు ప్రవర్తిస్తుడం పట్ల ఆయన సహచర కేబినెట్కు ఒంటికి కారం పుసుకున్నట్లుగా ఉంది. దాంతో ఎంతో కాలంగా పార్టీకి సేవ చేసుకుంటూ... ప్రజల మధ్య ఉండి... ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తాము... తుప్పు పట్టిన ఇనుపముక్కలా ఓ పక్కన పడి ఉన్నామని మిగతా మంత్రులు తెగ కలత చెందుతున్నారు. ఎంతైనా ఆయన టైము బాగుంది అంటూ నారాయణకు పట్టిన అదృష్టాన్ని చూసి 'వారు' తమలోతాము గుసగుసలాడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు