అయ్యో పాపం!

11 Aug, 2017 07:33 IST|Sakshi
అయ్యో పాపం!

ఏమండీ ఇది విన్నారా... జిల్లా మంత్రిగారికి పంద్రాగస్టునాడు జెండా ఎగరేసే అవకాశం ఇవ్వలేదట. పక్క జిల్లాకు చెంది... ఇక్కడి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రికే ఆ ఛాన్స్‌ దక్కిందంట! అవునండీ నిజం... ఏ అధికారం కోసమైతే ఆయన పార్టీ ఫిరాయించారో... కేవలం దానితోనే సరిపెట్టారట. ఆయన పార్టీలోకి రావడం ఇష్టంలేక తెగ బాధపడిపోయిన అధికార పార్టీ నాయకులు... కార్యకర్తలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారంట. జిల్లా పార్టీలో ఎలాగూ గౌరవం లేదు. మరి అధిష్టానం కూడా ఇలా చేసిందేంటని మంత్రిగారి అనుయాయులు తెగ బాధపడిపోతున్నారట.

- పదవి కోసం పార్టీ మారిన సుజయకృష్ణ రంగారావు
- తీరా వెళ్లాక అడుగడుగునా అవమానాలు
- అమాత్యునిగా ఉన్నా... కనీస గౌరవం కరువు
- జెండా ఆవిష్కరణకు నోచుకోని వైనం
- పెత్తనమంతా ఇన్‌చార్జి మంత్రికే...


సాక్షి ప్రతినిధి, విజయనగరం: అభివృద్ధి కోసమని.. కార్యకర్తల అభీష్టమని.. కుంటిసాకులు చెప్పి పదవి కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందా... ఆ పార్టీ కేడర్‌ నుంచి కనీస గౌరవం లభించడం లేదా... ఇప్పుడు అధిష్టానం సైతం అదే బాటలో నడుస్తోందా... అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఆయన రాకను జిల్లాలోని ఇప్పటికీ కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తుండగా తాజాగా అధిష్టానం కూడా అదే విధంగా అవమానించింది.  స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా మంత్రిని కాదని ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు పతాకావిష్కరణ చేసే అవకాశం కల్పిస్తూ సుజయ్‌కు ఆ అవకాశం కూడా లేకుండా చేసింది.

జిల్లాలో గంటా హవా
మరోవైపు జిల్లాలో ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు హవా నడుస్తోందనే చెప్పాలి. కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు మాటనే చెల్లనివ్వకుండా తనకు నచ్చిన వ్యక్తిని టీడీపీ జిల్లా అధ్యుక్షుడిగా తెచ్చుకోవడంతో గంటా ఇక్కడి నాయకులకు చెక్‌ పెట్టడం మొదలుపెట్టారు. పక్క జిల్లా నుంచి వచ్చి జిల్లా టీడీపీపై పెత్తనం చేలాయించడంతో పాటు మంత్రులను సైతం పక్కనబెట్టి పంచాయితీలు కూడా చేసేస్తున్నారు.

ప్రారంభోత్సవాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తానే ప్రముఖంగా ఉంటూ జిల్లా మంత్రులకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అయితే గంటా పెత్తనం ప్రభావం అశోక్‌ గజపతిరాజుపై కంటే సుజయ కృష్ణ రంగారావుపైనే ఎక్కువగా పడుతోంది. జిల్లాలో టీడీపీకి చెందిన మంత్రి ఉన్నప్పుడు ఆయనే పార్టీని నడిపించాల్సి ఉన్నా అధిష్టానం మాత్రం గంటాకే ఆ బాధ్యత అప్పగించింది.

వెంట నడవని జిల్లా నేతలు
- ఇటీవల ఎమ్మెల్సీ విజయరామరాజు పుట్టిన రోజునాడు  గిరిజన హస్పిటల్‌ తనిఖీలకు సుజయకృష్ణ వెళ్లారు. తనకు దారిలో కనిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సుజయ్‌ తాను ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రాంతంలో తనిఖీల గురించి తనకు చెప్పకపోవడం ఏమిటని ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారంట. అంతేగాదు. మంత్రి పర్యటనలో ఆ పార్టీ నాయకులు కనిపించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

- గజపతినగరం నియోజకవర్గం దత్తరాజేరులో ఓ పాఠశాల పీడీ పోస్టును మంత్రి సిఫార్సు చేసిన వ్యక్తికి ఇచ్చారు. ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. డీఈఓను, ప్రిన్సిపల్‌ను, అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులను పిలిచి మందలించారు. మంత్రి సిఫార్సును పక్కన పెట్టమంటూ మరో వ్యక్తిని సిఫార్సు చేస్తూ ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు.
- చినమేరంగిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ భవనాలను రూ. 10కోట్లతో కడితే వాటిని ఎమ్మెల్సీ విజయరామరాజు మంత్రి సుజయ కృష్ణ రంగారావును ఆహ్వానించకుండానే ప్రారంభించేశారు.
- జిల్లా టీడీపీ సమావేశాల్లోనూ పార్టీ నేతలు సుజయ్‌ను అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా పంచాయితీలేమున్నా అశోక్‌కు, గంటాకే చెబుతున్నారు.  

ఇంటా బయటా అవమానం
వైఎస్సార్‌సీపీలో కీలక నేతగా ఉంటూ ఆ పార్టీని అభిమానించే ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు సుజయకృష్ణ రంగారావు. సరిగ్గా ఏడాది గడిచే సరికి జిల్లాలో అభివృద్ధి జరగాలంటే ప్రతిపక్షంలో ఉంటే కుదరంటూ అధికారపక్షం పంచన చేరారు. మరుసటి ఏడాది మంత్రి పదవి తెచ్చుకున్నారు. కానీ ఇంత వరకూ చెప్పుకోదగ్గ అభివృద్ధి అంటూ ఏమీ చేయలేకపోయారు. కనీసం టీడీపీలోనైనా ప్రాభవాన్ని పెంచుకుంటున్నారా అంటే అదీ లేదు. ఇటీవల బయటపడ్డ ఆయన ఆస్తుల సంరక్షణ అంశంతో ఇంటా బయటా అభాసుపాలయ్యారు. చివరికి పార్టీ తలదించుకునే పని చేయనని, టీడీపీకి చెడ్డపేరు తీసుకురానని ఆయనే స్వయంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు