సూపర్ శ్రీను

5 Sep, 2015 00:15 IST|Sakshi

 చీపురుపల్లి: రోడ్డుపై వెళ్తుండగా వంద రూపాయల నోటు కనిపిస్తే  చటుకున్న వంగి తీసుకుని జేబులో వేసుకునే ఈ రోజుల్లో..పక్కపక్కనే ప్రయాణిస్తూ జేబులు కత్తిరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాంటిది ఎవ్వరూ లేని ఏటీఎంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.25 వేలు దొరికితే ఇంకేమైనా ఉందా. పట్టుకుని ఉడాయించేస్తారు కదా..!   కానీ అంతా అలాగే చేస్తారనుకుంటే పొరపాటే.. అందులో భాగంగా చీపురుపల్లి పట్టణానికి చెందిన సిరేల శ్రీను అనే యువకుడు ఎంతో నిజాయితీగా వ్యవహరించి  ఏటీఎంలో లభ్యమైన ఆ డబ్బులను ఏం చేయాలో తెలియక సాక్షి ప్రతినిధిని ఆశ్రయించాడు.
 
 దీంతో సాక్షి, ఆ యువకుడు సంయుక్తంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దొరికన డబ్బులను పోలీసులకు అప్పగించారు. ఎంతో నిజాయితీగా వ్యవహరించిన ఆ యువకుడిని అందరూ అభినందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. స్థానిక మెయిన్‌రోడ్‌లో గల పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ  ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు స్థానిక జి.అగ్రహారం ప్రాంతానికి చెందిన సిరేల శ్రీను అనే ఎంబీఏ విద్యార్థి శుక్రవారం ఉదయం 11.16 గంటల సమయంలో వెళ్లాడు. ఆయన లోపలకు వెళ్లేసరికి ఆ  ఏటీఎం యంత్రంలో నుంచి రూ.25వేలు నగదు, విత్‌డ్రా స్లిప్ బయటకు వచ్చాయి.
 
  లోపల చూస్తే ఎవ్వరూ లేరు. ఆ డబ్బులను తీసుకున్న శ్రీను ఎవరైనా వస్తారేమోనని దాదాపు అరగంట వరకు అక్కడే వేచి ఉన్నాడు. ఎవ్వరూ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక సాక్షి ప్రతినిధిని ఆశ్రయించాడు. దీంతో వారిద్దరూ సంయుక్తంగా చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై ఎం.నాగేశ్వరరావుకు వివరించి,  నగదును, విత్‌డ్రా స్లిప్‌ను హెచ్‌సీ కామేశ్వరరావుకు అప్పగించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ స్టేట్‌బ్యాంకును సంప్రదించి వాస్తవంగా ఈ డబ్బులు ఏ ఖాతాదారునికి చెందినవో తెలుసుకుని వారికి అప్పగించే చర్యలు చేపడతామ న్నారు. నిజాయితీగా వ్యవహరించిన యువకుడు శ్రీను, సాక్షి పత్రికను ఈ సందర్భంగా  ఎస్సై అభినందించారు.
 

మరిన్ని వార్తలు