‘సర్వే’ ఎదురు చూపులకు చెక్‌

5 Aug, 2019 04:45 IST|Sakshi

ఇకపై గ్రామంలోనే అందుబాటులో ఓ సర్వేయర్‌

దరఖాస్తు చేసిన వెంటనే భూములు, స్థలాల కొలతలు

గ్రామ సచివాలయాల్లో 11,158 సర్వేయర్‌ పోస్టుల భర్తీ

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారికి శిక్షణ

ప్రస్తుతం కేవలం 942 మంది మాత్రమే సర్వేయర్లు 

సాక్షి, అమరావతి: భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, భాగ పరిష్కారం (సబ్‌ డివిజన్‌), స్థలాల కొలతల కోసం ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. సర్వేయర్ల కోసం మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. ముడుపుల మాటే లేదు. ఇప్పటి వరకూ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు కలిపి మొత్తం 942 మంది ఉన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పోల్చితే మన రాష్ట్రంలోనే సర్వేయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక విస్తీర్ణం ప్రకారం కనీసం 4,000 నుంచి 5,000 వేల మంది సర్వేయర్లు అవసరమని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ గతంలో శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వాలు ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల క్రమేణా భూసంబంధమైన సమస్యలు పెరిగిపోయాయి. 

దేశ చరిత్రలోనే లేని విధంగా...
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే లేనివిధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు గ్రామ సచివాలయాల ద్వారా ఏకకాలంలో 11,158 సర్వేయర్‌ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం మండలానికి ఒక్క సర్వేయరు మాత్రమే ఉండగా ఈ పోస్టుల భర్తీతో ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్‌ ఉండనున్నారు. 2,000 మంది జనాభా ఉన్న గ్రామ సచివాలయంలో కూడా ఒక సర్వేయర్‌ అందుబాటులో ఉంటారు. దీంతో  గ్రామంలో కొలతల కోసం ఎవరు అర్జీ పెట్టుకున్నా అక్కడున్న సర్వేయర్‌ వెంటనే కొలతలు వేసి సబ్‌డివిజన్‌ చేస్తారు. సర్వేయర్లను నియమించగానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభమార్గంలో సర్వే చేసే విధానంపై శిక్షణ కూడా ఇస్తారు.

గ్రేడ్‌ –3 సర్వేయర్లుగా నియామకం
మొదట 11,158 మందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రేడ్‌ –3 సర్వేయర్లుగా నియమిస్తారు. తర్వాత వారికి నిబంధనల మేరకు గ్రేడ్‌–2 సర్వేయర్లుగా పదోన్నతి కల్పిస్తారు. గ్రేడ్‌ –2 సర్వేయర్లను పెద్ద గ్రామపంచాయతీల్లో నియమిస్తారు. గ్రేడ్‌–2 సర్వేయర్లను తదుపరి గ్రేడ్‌ –1కు ప్రమోట్‌ చేసి పట్టణాల్లో నియమిస్తారు. వీరందరినీ భూముల రీసర్వేకి ప్రభుత్వం వినియోగించుకుంటుంది. భూముల రీసర్వే, సర్వే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్వేయర్లను నియమిస్తోంది.  

మరిన్ని వార్తలు