రైతుల విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు..!

14 Feb, 2014 23:43 IST|Sakshi

దోమ, న్యూస్‌లైన్:  ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అందజేసిన శనగ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని ఊట్‌పల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటఉత్పత్తులను సాధించేందుకు వీలుగా ప్రభుత్వం రైతులకు వేరుశగన, శనగ, మొక్కజొన్న తదితర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.

 ఆయా పంటలను సాగు చేయడంలో సలహాలు, సూచనలు అందించడం, రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సదుపాయం కలిగించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద రబీ సీజన్‌లో శనగ పంట సాగుకు అధికారులు మండల పరిధిలోని ఊట్‌పల్లి, బొంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 75 మంది చొప్పున రైతులను ఎంపిక చేశారు. వారికి పంపిణీ చేసేందుకు ఒక్కో గ్రామానికి 75 బస్తాల చొప్పున మొత్తం 150 బస్తాలను రెండు నెలల క్రితం చేరవేశారు. అయితే కొంతకాలం పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత అమ్ముకుంటే ఎవరికీ తెలియదని భావించారు ఆదర్శరైతులు. ఈ క్రమంలో ఊట్‌పల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన శనగ విత్తనాలను గురువారం రాత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎప్పుడూ లేనిది ఊళ్లోకి కార్లు, ఆటోలు హడావుడిగా రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి  విషయం ఆరా తీశారు. ఓ గదిలో 32 శనగబస్తాలు దాచి ఉంచారని తెలిసింది. మొత్తం 75 బస్తాలకుగాను 32 మాత్రమే ఉండడంతో స్థానిక ఆదర్శరైతును నిలదీశారు. అతను తనకేం తెలి యదని బుకాయించాడు. గ్రామ సర్పంచ్ పద్మమ్మ తదితరులు గదికి తాళం వేసి విషయాన్ని జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పరిగి డివిజన్ వ్యవసాయాధికారి నాగేష్ కుమార్, మండల వ్యవసాయాధికారి రేణుకా చక్రవర్తిని శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం పంపిణీ చే యాల్సిన విత్తనాలను రబీ సీజన్ ముగుస్తున్నా ఎందుకు పంపిణీ చేయలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

 ఏడీఏతో పాటు మండల వ్యవసాయాధికారి పొం తనలేని సమాధానాలు చెప్పడం తో  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఆదర్శరైతులు కుమ్మక్కై విత్తనాలను అమ్ముకుం టున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బొంపల్లి గ్రామంలోనూ విత్తనాలు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు