దుర్గమ్మకు బోనాలు సమర్పించిన స్వామిగౌడ్

26 Apr, 2015 02:23 IST|Sakshi
దుర్గమ్మకు బోనాలు సమర్పించిన స్వామిగౌడ్

ప్రోటోకాల్ పాటించని ఆలయ అధికారులు
 
 విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ మండలి సభాపతి స్వామిగౌడ్ శనివారం బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఏటా దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటానన్నారు. ఈ ఏడాది సభాపతిగా బాధ్యతలు పెరగడంతో అమ్మవారి దర్శనం కాస్త ఆలస్యం అయిందన్నారు. తన కుటుం బం తరఫున అమ్మవారికి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంతో కేంద్రం అన్యాయం చేసినట్లు అయిందన్నారు.
 
 గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో చేయాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపై ఉండేవని, ఉద్యమ నేపథ్యంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఇదిలావుండగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్వామిగౌడ్‌ను ప్రధానగేటు నుంచి కాకుండా పక్కనే ఉన్న ప్రొవి జన్స్ స్టోర్స్ మీదుగా ఆలయానికి తీసుకువెళ్లడం విమర్శలకు దారి తీసింది.  ప్రోటోకాల్‌ను పాటించకపోవడంపై దేవాదాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు