ఇక విశాఖలో సింబెక్స్‌ సందడి

17 Nov, 2018 08:47 IST|Sakshi
విశాఖ తీరానికి చేరుకున్న భారత్, సింగపూర్‌ యుద్ధ నౌకలు

తీరానికి చేరుకున్న ఇండో–సింగపూర్‌ నౌకలు

19 నుంచి మూడు రోజుల పాటు విన్యాసాలు

నేవీ మారథాన్‌ రేపు

విశాఖసిటీ: నాలుగు రోజుల పాటు పోర్టు బ్లెయిర్‌లో అండమాన్‌ సముద్రం వేదికగా సాగిన సింబెక్స్‌–2018 సిల్వర్‌ జూబ్లీ విన్యాసాలు ఈ నెల 19 నుంచి విశాఖ వేదికగా జరగనున్నాయి. ఇందులో భాగంగా పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి భారత్, సింగపూర్‌ యుద్ధ నౌకలు, విమానాలు, హెలి కాప్టర్లు శుక్రవారం తూర్పునౌకాదళం ప్రధాన కేంద్రం విశాఖకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సింగపూర్‌ నౌకాదళ బృందానికి తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌సింగ్‌ జ్ఞాపికలు అందించారు.

భారత్‌ నౌకాదళం, రిపబ్లికన్‌ ఆఫ్‌ సింగపూర్‌ దేశాలు కలిసి పాతికేళ్లుగా సింబెక్స్‌ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అండమాన్‌ సముద్రంలో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో ఇరుదేశాలకు చెందిన 12 నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. రెండో విడత విన్యాసాలు విశాఖ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి తూర్పునౌకాదళం అంతా సిద్ధం చేసింది.

పాల్గొనే నౌకలివే..
రిపబ్లిక్‌ ఆఫ్‌ సింగపూర్‌ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ ఫర్మిడబుల్, ఆర్‌ఎస్‌ఎస్‌ స్టెడ్‌ఫాస్ట్, ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిటీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విగార్, ఆర్‌ఎస్‌ఎస్‌ వాలియంట్, డీప్‌ సీ రెస్క్యూ వెహికల్‌ నౌకతో పాటు ఆర్చర్‌ క్లాస్‌ జలాంతర్గామి ఆర్‌ఎస్‌ఎస్‌ స్వార్డ్స్‌మాన్‌తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు పాల్గొననున్నాయి. ఇక భారత యుద్ధ నౌకలైన రణ్‌వీర్‌ క్లాస్‌ యుద్ధ నౌక, ఐఎన్‌ఎస్‌ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కద్మత్, ఐఎన్‌ఎస్‌ కిర్చి, ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఐఎన్‌ఎస్‌ సుకన్య, ఐఎన్‌ఎస్‌ శక్తితో పాటు సింధుఘోష్‌ తరగతికి చెందిన సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ సింధుకీర్తితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు విశాఖ సముద్ర జలాల్లో విన్యాసాల్లో పాల్గొననున్నాయి. సింబెక్స్‌లో భాగంగా ఇరుదేశాల నౌకాదళాధికారుల విన్యాసాలు, కార్యచరణ సమావేశాలతో పాటు స్నేహపూర్వక వాలీబాల్, బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ నెల 18న జరగనున్న నేవీ మారథాన్‌లో సింగపూర్‌ నౌకాదళ బృందం పాల్గొననుంది.

మరిన్ని వార్తలు