విశాఖ తూర్పులో సామాజిక న్యాయ నినాదం

19 Nov, 2023 05:45 IST|Sakshi
విశాఖ తూర్పు నియోజకవర్గంలోని సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం.. బస్సు యాత్రలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు  

వేలాది జనం మధ్య సామాజిక సాధికార యాత్ర

సీఎం జగన్‌ చేసిన మేలును వివరిస్తూ యాత్రలో పాల్గొన్న ప్రజలు

అశేష జనవాహిని మధ్య బహిరంగ సభ

జై జగన్‌ నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం

సాక్షి, విశాఖపట్నం/ఆరిలోవ: విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. ఆ నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమను అభివృద్ధి పథంలో నడిపించిన వైనాన్ని వివరిస్తూ శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.

నియోజకవర్గ సమన్వయకర్త, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బస్‌ యాత్రను పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరిలోవ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలతో ప్రారంభమైన యాత్ర.. పులి వేషాలు, డప్పు వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పెదగదిలిలో బీఆర్‌టీఎస్‌ మీదుగా జాతీయ రహదారికి చేరుకుంది. అక్కడకు వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు జతకూడాయి. వెంకోజీపాలెం, ఇసుకతోట మీదుగా ఎంవీపీ కాలనీలోని సభా ప్రాంగణానికి యాత్ర చేరుకుంది. ఇక్కడ సభలో అశేష జనవాహిని పాల్గొన్నారు. అడుగడుగునా సీఎం జగన్‌కు జేజేలు పలికారు.

ఈ సాధికారత నభూతో నభవిష్యతి: మంత్రి విశ్వరూప్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారత నభూతో నభవిష్యతి అని మంత్రి పినిపె విశ్వరూప్‌ చెప్పారు. రాష్ట్ర కేబినేట్‌ సహా అన్ని రకాల పదవుల్లో, పథకాల్లో పెద్దపీట వేసి సీఎం వైఎస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలన పొరుగు రాష్ట్రాలకూ దిక్సూచీ అయిందని కొనియాడారు.

నిరంతరం పేదోడి బాగోగుల కోసం పరితపించే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందరమూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్లగా ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న సుపరిపాలనను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అయితే.. బడుగు బలహీనవర్గాల వారిని హీనంగా చూస్తూ దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాలుగున్నరేళ్లలో 2.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఏపీలో అమలు చేసే పింఛను విధానాన్ని అమలు చేస్తామని బహిరంగంగా ప్రçశంసించారన్నారు. సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థను తెలంగాణలో అమలు చేస్తామని అక్కడి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందన్నారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన అనేక సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తున్నారని తెలిపారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో పది హార్బర్‌లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారని చెప్పారు. విశాఖలో హార్బర్‌ ఆధునీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేశారన్నారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారే తప్ప వారి బాగోగులు చూసిన సందర్భాలు లేవన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవే వర్గాలను అందలం ఎక్కించి, సాధికారతకు తోడ్పడుతున్నారని చెప్పారు. కేబినెట్‌ సహా అన్ని పదవుల్లో అధిక భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కట్టబెట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఒక ఊరులో ఒక జాతి మాత్రమే బాగుండాలంటే చంద్రబాబు కావాలని, అదే ఊరులో అందరూ బాగుండాలంటే  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రావాలని తెలిపారు.

ఉత్తరాంధ్రలో బడుగు బలహీన వర్గాల వారికి కీలక పదవులు కల్పించి సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ అన్నారు. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పేదోడు ఆర్థికంగా ఎదగాలన్నా సీఎంగా మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్‌ హరివెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు