అదనం కలిపినా నాలుగు గంటలే!

15 Jan, 2019 03:32 IST|Sakshi

ఉచిత విద్యుత్తుపై ప్రచారం కోసమే సర్కారు ప్రకటనలు

ఏడు గంటలని చెబుతున్నా ఇప్పుడిచ్చేది 3.5 గంటలే

రోజుకు 59 ఎంయూలు అవసరమైతే 29 ఎంయూలే సరఫరా..

ఇక 9 గంటలు ఇవ్వాలంటే రోజూ 76 ఎంయూలు అవసరం..

కానీ సర్కార్‌ రోజూ అదనంగా ఇస్తామంటోంది 32 ఎంయూలే

9 గంటల పాటు విద్యుత్తు సరఫరాపై చిత్తశుద్ధి లేని ప్రకటనలు

సాక్షి, అమరావతి: వ్యవసాయదారులకు అందించే ఉచిత విద్యుత్‌ను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఎలా సమకూరుస్తారనే ప్రణాళిక లేకుండా ఎన్నికలకు ముందు హడావుడి ప్రచారానికి దిగటాన్ని విద్యుత్‌ వర్గాలే విమర్శిస్తున్నాయి. టీడీపీ సర్కారు దీన్ని కేవలం ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంటున్నారు. తొమ్మిది గంటల పాటు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్తు ఎంత? ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర విషయాలను ప్రభుత్వం ఎక్కడా వివరించలేదని గుర్తు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రైతులకు రోజూ ఏడు గంటల చొప్పున ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సర్కార్‌ చెబుతున్నా వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే సగం సమయం కూడా సరఫరా చేయడం లేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు అదనంగా ఇస్తామంటున్న కరెంట్‌ను కలిపినా కూడా ఉచిత విద్యుత్తు సరఫరా నాలుగు గంటలకు మించదని భావిస్తున్నారు.

ప్రణాళిక లేకుండా ప్రకటనలు..
వ్యవసాయ విద్యుత్‌ ఖర్చంతా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అందచేయాలి. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ఇటీవల సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్‌ఆర్‌) ప్రకారం 2019–20లో కనీసం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు డిస్కమ్‌లు పేర్కొన్నాయి. వ్యవసాయ సబ్సిడీనే రూ. 7 వేల కోట్లకుపైగా ఉంది. ఈ మొత్తంలో ప్రభుత్వం ఎంత ఇస్తుందో లెక్క తేల్చలేదు. 2019–20లో రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా కమిషన్‌ ఆమోదం కోసం పంపలేదు. ఇవేవీ పట్టించుకోకుండా నోటిమాటగా 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పడం రైతులను మోసగించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇస్తోంది మూడున్నర గంటలే..
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో పంపుసెట్‌ (5 హెచ్‌పీ) గంట పాటు పనిచేస్తే 5 యూనిట్ల చొప్పున విద్యుత్‌ ఖర్చవుతుంది. ప్రభుత్వం ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్టు చెబుతోంది. అంటే రోజుకు ఒక్కో పంపుసెట్‌కు 35 యూనిట్లు విద్యుత్‌ ఖర్చవుతుంది. ఈ లెక్కన 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 59 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్‌ 10,831.44 మిలియన్‌ యూనిట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే రోజుకు కేవలం 29.67 మిలియన్‌ యూనిట్లే ఇస్తోందన్నమాట. ఒక్కో పంపుసెట్‌ ఏడు గంటల పాటు పనిచేసేందుకు రోజుకు 35 యూనిట్లు అవసరం కాగా ప్రభుత్వం ఇచ్చేది 17 యూనిట్లు మాత్రమే. అంటే గంటకు ఒక్కో పంపుసెట్‌కు 5 యూనిట్ల చొప్పున లెక్కేస్తే కేవలం మూడున్నర గంటల పాటు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదు. కానీ రోజుకు ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్టు నాలుగున్నరేళ్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది.

అదనపు విద్యుత్తు కలిపినా నాలుగు గంటలే!
రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలంటూ ఒక్కో పంపుసెట్‌కు రోజుకు 45 యూనిట్ల చొప్పున విద్యుత్‌ ఇవ్వాలి. అంటే 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 76 మిలియన్‌ యూనిట్లు అందించాలి. ఈ లెక్కన ఏడాదికి 27,922.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా ఇస్తున్న 10,831.44 మిలియన్‌ యూనిట్లతో పాటు మరో 1,200 మిలియన్‌ యూనిట్లు మాత్రమే అదనంగా సరఫరా చేస్తానంటోంది. దీంతో మొత్తం కలిపినా ఉచిత విద్యుత్‌కు ఇచ్చేది 12,031.44 మిలియన్‌ యూనిట్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పెంచే విద్యుత్‌ను కలిపినా రోజుకు నాలుగు గంటల పాటు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవ విద్యుత్‌ వినియోగం, ప్రభుత్వం ఇస్తామనే అదనపు విద్యుత్‌ సరఫరాకు మధ్య 15,831.06 మిలియన్‌ యూనిట్ల తేడా ఉంది. ఇంత తేడా ఉంటే 9 గంటల సాగుకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్‌ వర్గాలే విమర్శిస్తున్నాయి.

మరిన్ని వార్తలు