లైన్లు లేకున్నా లైన్‌ క్లియర్‌!

17 Aug, 2019 04:16 IST|Sakshi

పవన విద్యుత్‌కు అడ్డగోలుగా అనుమతులు 

ట్రాన్స్‌మిషన్‌ లైన్ల సామర్థ్యం 997 మెగావాట్లు 

1,851 మెగావాట్ల పవన విద్యుత్‌కు అనుమతులు 

ఉరవకొండలో అవినీతి అనకొండలు.. టీడీపీ హయాంలో స్కాం

విజిలెన్స్‌ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఏపీ ట్రాన్స్‌కోలో చోటు చేసుకున్న మరో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలో అసలు సరిపడా లైన్లే లేకుండా పవన విద్యుత్‌కు అనుమతులు మంజూరు చేయడం విద్యుత్‌ వర్గాలనే విస్మయానికి గురి చేస్తోంది. విండ్‌ పవర్‌ లాబీ, విద్యుత్‌ అధికారులు, టీడీపీ పెద్దలు కలసికట్టుగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ట్రాన్స్‌కో విజిలెన్స్‌ పరిశీలనలో వెల్లడైంది. 2017లో జరిగిన ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో విజిలెన్స్‌ విభాగం ఇటీవల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేసింది. అవసరం లేకుండా ప్రైవేట్‌ పవన విద్యుత్‌కు గత సర్కారు ఎలా పెద్దపీట వేసిందో నిపుణుల కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చడం తెలిసిందే. 

లోపాయికారీ ఒప్పందంతో అనుమతులు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పవన విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించింది. నిజానికి ఆ సమయంలో అన్ని రాష్ట్రాలు బిడ్డింగ్‌ ద్వారానే పవన విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. అయితే విండ్‌ లాబీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందంతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సరిపడా ట్రాన్స్‌కో లైన్లు లేకున్నా పవన విద్యుత్‌ కొనుగోలుకు ట్రాన్స్‌కో అధికారులు పచ్చజెండా ఊపడం గమనార్హం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై వ్యక్తమైన ఆరోపణలను అధికారులు తొక్కిపెట్టారు.

సగానికి పైగా అదనం
ఉరవకొండ పరిధిలో పవన విద్యుదుత్పత్తికి పలు బడా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకు విద్యుదుత్పత్తి జరిగే ప్రదేశంలో 400 కేవీ సబ్‌స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయాలి. 2017 నాటికి ఏపీ ట్రాన్స్‌కో కేవలం 997 మెగావాట్ల విద్యుత్‌ తీసుకునేందుకు వీలుగా ట్రాన్స్‌కో లైన్లను విస్తరించింది. కానీ గత ప్రభుత్వం ఏకంగా 1,851 మెగావాట్ల మేర విద్యుత్‌ తీసుకునేందుకు విండ్‌ ఉత్పత్తిదారులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని పవన విద్యుత్‌ ఉత్పత్తిదారులు విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు తీసుకున్నారు.

వీటిల్లో మాజీ ముఖ్యమంత్రికి బినామీగా వ్యవహరించిన వ్యక్తులకు సంబంధించిన పవన విద్యుత్‌ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఓ పవన విద్యుత్‌ సంస్థ విద్యుత్‌ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు తేలింది. టీడీపీకి చెందిన స్థానిక నేత ఒకరు మాజీ ముఖ్యమంత్రికి విండ్‌ లాబీ నుంచి భారీగా ముడుపులు ఇప్పించినట్టు విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎలాంటి లైన్లు లేకుండానే 854 మెగావాట్ల మేర పవన విద్యుత్‌ ఉత్పత్తికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికప్పుడు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా వేరే ప్రదేశం నుంచి 500 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఉరవకొండ ప్రాంతంలో బిగించడం విశేషం.

ఓ అధికారి కీలక పాత్ర
ట్రాన్స్‌కోలో డిప్యుటేషన్‌పై పనిచేసిన ఓ అధికారి పాత్రపై పలు  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన విద్యుత్‌ లాబీకి, మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆయనే బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పటి ఇంధనశాఖ ముఖ్య అధికారి ప్రమేయం కూడా ఉందని విజిలెన్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఉరవకొండ ప్రాంతంలో సరిపడా లైన్లు లేవని, సామర్థ్యానికి మించి పవన విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడం సరికాదని స్థానిక అధికారులు నివేదికలు పంపినా డిçప్యుటేషన్‌పై వచ్చి ట్రాన్స్‌కోలో పనిచేసిన అధికారి వినలేదని తెలిసింది. నివేదికలు ఇచ్చిన ఇంజనీర్లను పిలిచి మందలించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అప్పటి సీఎం ఆదేశాల మేరకు జరిగిందని, ఇంధనశాఖ ముఖ్య అధికారి ఇంజనీర్లను సైతం బెదిరించినట్టు తెలిసింది. గత్యంతరం లేక క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఉన్నతాధికారుల మాట వినాల్సి వచ్చిందని విజిలెన్స్‌ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది పూర్తి స్థాయి నివేదికలో తేలనుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా