చంద్రబాబును ఒప్పిస్తాం: కొండ్రు మురళి

19 Dec, 2019 14:54 IST|Sakshi
కొండ్రు మురళి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకుడు వ్యతిరేకిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు టీడీపీ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందించాలని, ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు.

గురువారం ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. సహజసిద్ధ నగరమైన విశాఖపట్నానికి పరిపాలనా రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. టైర్‌-1 సిటీ కావాలంటే కచ్చితంగా విశాఖపట్నాన్ని పోత్సహించాలని అభిప్రాయపడ్డారు. 13 జిల్లాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే మెట్రో సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. మెట్రో సిటీతో ఉపాధి లభించడంతో పాటు పెట్టుబడులు తరలివస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో అమరావతి వచ్చి చూసిన వెళ్లిన కంపెనీలు అటు నుంచి హైదరాబాద్‌ కానీ, బెంగళూరు కానీ వెళ్లి పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు.

వైజాగ్‌ను పరిపాలనా రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, దీన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ వాదించడానికి లేదని, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ కంటే ప్రాంతం ముఖ్యమని స్పష్టం చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామంటే అడ్డుకోవడం సరికాదని అచ్చెన్నాయుడుతో కూడా చెప్పినట్టు వెల్లడించారు. సింగపూర్‌ లాంటి రాజధాని కట్టడం వంద సంవత్సరాలైన అవదన్న విషయం తమ నాయకుడు చంద్రబాబుకు కూడా తెలుసునని చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబును ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని కొండ్రు మురళి వ్యక్తం చేశారు. కాగా, ఇంతకుముందు గంటా శ్రీనివాసరావు కూడా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం జగన్‌ నిర్ణయం మంచిదని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు...

బహుళ రాజధానులే బహుబాగు

‘ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదు’

సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు

రాష్ట్రంలో పండుగ వాతావరణం

ఒకేచోట అభివృద్ధితో సీమాంధ్రకు దారుణ నష్టం

మరిన్ని వార్తలు