పచ్చనేతల.. ప్రలోభాలు..

8 Apr, 2019 12:14 IST|Sakshi

ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మద్యం, నగదు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ అభ్యర్థుల తరఫున మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది.   

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బంది, పార్టీ నాయకులు నగదు పంచుతుండగా ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు, పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట చిన్నబాలయ్యనగర్‌లో ఆదివారం నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన కె.రమేష్‌బాబు, భాస్కర్, మల్లేష్, నరసింహారావు, పుండరీకాక్షయ్యలు ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారి దామోదర్, నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కట్టా శ్రీనివాసులు, ఎస్సై వీరప్రతాప్‌లు తమ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నారాయణకు సంబంధించిన కరపత్రాలు, ఓటరు స్లిప్పులు, రూ.2.74 లక్షల నగదును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

నగదు పట్టుకున్న విషయంపై సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నేతలు స్టేషన్‌కు చేరుకుని తమ వారిని వదిలిపెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం మీడియాకు తెలియడంతో కనీసం తమవారిని మీడియాలో రాకుండా చూడాలని కోరారు. దీంతో అధికారులు వారిని మీడియా కంటపడకుండా లోపల కూర్చోబెట్టారు.

  మరో రెండుచోట్ల..
నెల్లూరులోని రంగనాయకులపేట రైలువీధిలో ఆదివారం రాత్రి జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన టీడీపీ నాయకులు ఎస్‌కే లుక్‌మాన్‌ తన అనుచరులతో కలిసి ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.10 వేల నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి ఆదివారం ఎన్టీఆర్‌ నగర్‌లో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్‌ ఇన్‌చార్జి జీబీపీ ప్రవీణ తన సిబ్బందితో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వర్లు నుంచి రూ.36 వేల నగదు, తెలుగుదేశం పార్టీ కరపత్రాలు, ఓటరు స్లిప్పులను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లును బాలాజీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

మద్యం తరలిస్తుండగా..
సంగం: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తరలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శనివారం అర్ధరాత్రి రెండు చోట్ల పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. సంగం మండలంలోని పడమటి అరవపాళెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పర్వతాల వెంకటరత్నం, తాండ్ర రాము, పర్వతాల అశోక్‌లతోపాటు మరికొందరు శనివారం అర్ధరాత్రి మండల కేంద్రమైన సంగంకు వచ్చారు. అక్కడ ఓ బ్రాందీలో 1,959 క్వార్టర్‌ మద్యం బాటిళ్లను బస్తాల్లో కట్టుకుని ట్రక్కు ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో సంగం ఎస్సై గోపాల్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు.

పోలీసులను చూసి కొందరు పారిపోగా వెంకటరత్నం, రాము, అశోక్‌లను అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారికి సంబంధించిన 11 మోటార్‌బైక్‌లను, ట్రక్కు ఆటోను స్టేషన్‌కు తరలించారు. అలాగే మండలంలోని పడమటిపాళెం, పల్లిపాళెంలో రెండు బైక్‌లపై మద్యం తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పఠాన్, షేక్‌ రసూల్, ఫయాజ్‌ బాషా, తమలపాకుల ప్రశాంత్, పర్సుబోయిన పెంచలప్రసాద్, ప్రసాద్‌లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 154 క్వార్టర్‌ బాటిళ్లను, రెండు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కేసు మాఫీకి విఫలయత్నాలు 
తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకులు భారీ ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడడంతో ఆ పార్టీ మండల నాయకులు ఆదివారం పోలీసు స్టేషన్‌కు పరుగులు తీశారు. వారిని వదిలేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. కేసు నమోదు చేశామని బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌బాబు, ఎస్సై గోపాల్‌ వారికి చెప్పారు. ఎలాగైనా కేసు లేకుండా చూడాలని కొందరు నాయకులు మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. అయితే పోలీసులు వారి పట్టించుకోలేదు. ఈ దాడుల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి రమేష్, సిబ్బంది రవీంద్రబాబు, శంకరయ్య, హరిబాబు, ఎస్సై గోపాల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు సంగం వచ్చి మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులను అభినందించారు. టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు.

గూడూరులో 371 బాటిళ్ల స్వాధీనం
గూడూరు రూరల్‌: రూరల్‌ మండలంలోని చెంబడిపాళెం గ్రామంలో ఓటర్లకు పంచేందుకు టీడీపీకి చెందిన కట్టా శివయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 371 మద్యం బాటిళ్లను ఆదివారం గూడూరు రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూరల్‌ ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.  

బోగోలు మండలంలో భారీగా మద్యం పంపిణీ

బిట్రగుంట: బోగోలు మండలంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐదురోజుల నుంచి గ్రామాలకు పెద్దఎత్తున చీప్‌లిక్కర్‌ తరలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోలీసులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నా తరలింపు మాత్రం ఆగడం లేదు. దగదర్తి మండలం ఉలవపాళ్లలోని ఒక మద్యం దుకాణం, బోగోలులోని మరో మద్యం దుకాణం, ఇస్కపల్లిలోని మద్యం దుకాణాల ద్వారా గ్రామాలకు భారీ స్థాయిలో మద్యం చేరవేస్తున్నారు. బోగోలులోని టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి స్లిప్పులు రాసిస్తే ఆయా దుకాణాల్లో మద్యం కేసులు అందజేస్తున్నారు.

కేసుల కొద్దీ మద్యాన్ని గ్రామాలకు తరలించడంతోపాటు ఓటర్లకు నేరుగా మద్యం స్లిప్పులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో మూడురోజులు మాత్రమే గడువుండటంతో ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఈ చౌకబారు పనులపై మహిళలు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులు భారీ స్థాయిలో మద్యం పంపిణీ చేస్తున్నా పోలీసులు, ఎన్నికల నిఘా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి.  

మర్రిపాడులో రూ.10 లక్షల పట్టివేత

మర్రిపాడు: మండలంలో టీడీపీ నాయకులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.10 లక్షల నగదును ఆదివారం ఫ్లయింగ్‌స్క్వా డ్‌ అధికారులు, మర్రిపాడు పోలీసులు పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. కంపసముద్రం గ్రామంలో టీడీపీ నేత మల్లు రమణారెడ్డి ఇంట్లో రూ.10 లక్షలు నగదు నిల్వ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులతో కలిసి నాయకుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు.

నగదుకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదును ఉంచినట్లు చెబుతున్నారు. నగదును ట్రెజరీలో జమ చేస్తామని మర్రిపాడు ఎస్సై కొండపనాయుడు పేర్కొన్నారు. కాగా మండలంలో రెండురోజుల నుంచి టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో కాలనీకి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు