ఎస్సీల ఇంటి స్థలాలకు ఇక్కడ అనుమతి లేదు

26 Mar, 2020 09:06 IST|Sakshi
టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బోర్డు

బోర్డు నాటిన టీడీపీ నాయకులు 

రాళ్లు పీకేసిన వైనం 

సాక్షి, పూతలపట్టు: పూతలపట్టు మండలం పాలకూరు గ్రామ సమీపంలో ఎస్సీలకు ఇంటిస్థలాలు ఇవ్వకూడదని బుధవారం ఆ గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలకూరు గ్రామానికి సంబంధించి రెవెన్యూ అధికారులు లబి్ధదారులకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు స్థానికంగా సిద్ధం చేశారు. అక్కడ రాళ్లు నాటి లేఅవుట్లు కూడా వేశారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎస్సీలకు ఇంటి స్థలాలు ఇవ్వకూడదని బుధవారం సాయంత్రం పట్టుపట్టారు.

లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్లు ఏకంగా బోర్డు నాటడం, నాటిన రాళ్లను పీకేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అడ్డొచ్చిన ఎస్సీలపై వారు ఎదురు దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఘర్షణకారులను చెదరగొట్టారు. దీనిపై తహసీల్దార్‌ విజయ భాస్కర్‌నును వివరణ కోరగా అది ప్రభుత్వ భూమి అని, అందులో బోర్డు నాటడం, రాళ్లు పీకేయడం చట్టరీత్యా నేరమని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు