ఊరంతా ఉష్‌.. గప్‌ చుప్‌

28 Oct, 2018 06:50 IST|Sakshi

జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడి  స్వగ్రామంలో నిశ్శబ్ద వాతావరణం

 సిట్‌ విచారణతో భయాందోళన

 నోరు విప్పేందుకు వెనుకంజ

 గ్రామస్తులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు

 సమాచారం ఇవ్వడానికి ముందుకు రాని ఠాణేలంక వాసులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆ గ్రామంలో ఎప్పుడూ మాట్లాడుకునే పిచ్చాపాటి మాటలు కూడా వినిపించడం లేదు. నలుగురు కలసి మాట్లాడుకునే పరిస్థితులు కూడా కరువయ్యాయి. ఎవరిని పలకరించినా కనీసంగా కూడా మాట్లాడడం లేదు. ముమ్మిడివరం మండలం ఠాణేలంక బాడవలో పరిస్థితి ఇది. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనిపెల్ల శ్రీనివాసరావు స్వగ్రామం ఠాణేలంకలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గ్రామస్తులను ఎవరిని ప్రశ్నించినా, ఏ విషయం అడిగినా తమకు ఏమీ తెలియదని ముఖం చాటేస్తున్నారు. మూడు రోజులుగా పోలీసులు, సిట్‌ అధికారులు నిందితుడి ఇంటి వద్ద, గ్రామంలోను జరిపిన విచారణ ఫలితంగా ఎవ్వరూ నోరు విప్పడానికి సాహసించడం లేదు. ఎవరైనా ఏవైనా వివరాలు చెబితే వారిని కూడా విచారిస్తారేమోనన్న భయంతో అందరూ మౌనం వహిస్తున్నారు.

భయపడుతున్న జనం
గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా స్థా నికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడి సోదరి విజయదుర్గతో పాటు స్నేహితుడు చైతన్యను సిట్‌ అధికారులు విచారణ నిమిత్తం తీసుకెళ్లడంతో మిగిలిన గ్రామస్తులు ఏదైనా మాట్లాడితే తమను తీసుకువెళ్తారేమోనన్న భయంతో నిజాలు చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు గురించి అన్ని విషయాలూ తెలిసినవారు కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. శ్రీనివాసరావు స్నేహితులు కూడా గ్రామంలో ఉండటం లేదు. ఎక్కడ తమను విచారణకు పిలుస్తారోనని గ్రామం బయట కాలం వెళ్లదీస్తున్నారు. 

కాల్‌ డేటా ఆధారంగా సిట్‌ విచారణ : నిందితుడి కాల్‌ లిస్ట్‌ ఆధారంగా సిట్‌ అధికారులు విచారణ చేపడుతున్నారు. కొంతకాలంగా అతడు చేసిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా సదరు గ్రామస్తుల వివరాలపై సిట్‌ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోదరి విజయదుర్గ తల్లిదండ్రులను, అంగన్‌వాడీ టీచర్‌ను, మరికొంతమందిని సిట్‌ అధికారులు శనివారం విచారించారు. శ్రీనివాసరావు కాల్‌ లిస్టులో ఉన్నవారందరూ తాము గ్రామంలో ఉన్నప్పుడు వస్తేసరి, లేదంటే విశాఖ వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుందని సిట్‌ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఎవరిని ఎప్పుడు పిలుస్తారోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బయటి వ్యక్తులతో కానీ, ఇరుగుపొరుగు వారితో కానీ మాట్లాడేందుకు భయపడుతున్నారు.

గ్రామస్తులపై టీడీపీ నేతలు ఒత్తిడి
గ్రామానికి ఎవరు వచ్చినా ఎటువంటి సమాచారమూ ఇవ్వవద్దని గ్రామస్తులకు టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చిన లబ్ధి వివరాలను గోప్యంగా ఉంచాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పార్టీతో ఉన్న సంబంధాలపై స్పందించవద్దని గ్రామస్థాయి టీడీపీ నాయకులను సహితం అప్రమత్తం చేశారు. సమాచారమిస్తే పోలీసు కేసుల్లో ఇరుక్కుంటారని గ్రామస్తులను భయపెడుతున్నట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు తమకు ఎందుకు వచ్చిన గొడవ అని మిన్నకుండిపోతున్నారు.

మరిన్ని వార్తలు