ప్రభుత్వం మారినా పదవులను వదలరా!

23 Jun, 2019 10:09 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు నెలకావస్తోంది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్‌ పదవులు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు ఇంకా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వారందరూ రాజీనామాలు సమర్పించాలి. వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందుబాటులోకి వచ్చే నామినేటెడ్‌ పదవులకు అభ్యర్థులను నియమించి హడావుడిగా ప్రమాణ స్వీకారాలు చేయించారు.

మే 23న శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఘోర పరాజయం పాలైంది. రాజీనామా చేయకుండా.. వాస్తవంగా ఎన్నికల్లో గత ప్రభుత్వం విజయం సాధిస్తే ప్రస్తుతం నియమితులైన వారు నిర్ణీత పదవీకాలం పూర్తయ్యే వరకూ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఓటమి పాలైన వారందరూ తక్షణమే రాజీనామా చేయాలి. కానీ రాజమహేంద్రవరం నగరంలో మాత్రం టీడీపీ నాయకులు ఇంకా నామినేటెడ్‌ పదవుల్లో కొనసాగుతున్నారు. నగరంలోని పలు ట్రస్ట్‌బోర్డులకు కమిటీల నియామకం జరిగింది. జీవకారుణ్య సంఘానికి వర్రే శ్రీనివాస్, హితకారిణి సమాజానికి యాళ్ల ప్రదీప్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానానికి అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, చందాసత్రానికి ఇన్నమూరి దీపు, ఉమారాలింగేశ్వర కల్యాణ మండపానికి మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు సత్రానికి రెడ్డి మణి చైర్మన్లుగా ఉన్నారు. వీరందరూ ఇంకా పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు