గూడులేని గురుకులం

23 Jun, 2019 10:06 IST|Sakshi
కంప్యూటర్‌ ల్యాబ్‌లో చదువుకుంటున్న విద్యార్థినులు

ఎన్నో ఏళ్ల నుంచి అద్దెభవనాల్లోనే నిర్వహణ

ఖాళీ చేయమనడంతో అగమ్యగోచరంగా విద్యార్థినుల భవితవ్యం

ఇదీ విజయవాడ విద్యాధరపురంలోని గురుకుల పాఠశాల పరిస్థితి

విజయవాడలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలకు కష్టమొచ్చింది. గూడు కరువయ్యే పరిస్థితి నెలకొంది. 150 మంది మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఆర్టీసీకి చెందిన భవనంలో కొనసాగుతుండగా ఖాళీ చేయాలని ఆ సంస్థ యాజమాన్యం హుకుం జారీ చేసింది.

సాక్షి, భవానీపురం: మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు గూడు కల్పించి విద్యా బోధన చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలకు ఇప్పుడు గూడు కరువైంది. 14 ఏళ్ల నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న ఈ పాఠశాలను ఖాళీ చేయాలంటూ ఏడాది నుంచి ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హుకుం జారీచేస్తున్నారు. ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంకాగా నెల రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ ఎండీ మరోసారి హెచ్చరికలు జారీచేశారు. దీంతో విద్యార్థినుల భవితవ్యం అయోమయంలో పడింది. అద్దె భవనం కోసం వెతుకులాడుతూనే ఉన్నామని, సుమారు 150 మంది విద్యార్థినులకు సరిపోయే వసతిగృహం దొరకడం కష్టసాధ్యంగా ఉందని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆంధ్రవాణి చెబుతున్నారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాల గూడు గోడు ఇలా ఉంది..

రూ.70 వేలు అద్దె చెల్లిస్తున్నా వేధింపులే
శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు గల 9 జిల్లాల్లోని 5 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించే ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ విద్యార్థినుల కోసం ప్రభుత్వం 2003లో రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలను గుణదలలోని ఒక అద్దె భవనంలో ప్రారంభించింది. అయితే అక్కడ స్థలం సరిపోకపోవడంతో గతంలో విద్యాధరపురం ఆర్టీసీ ట్రైనింగ్‌ స్కూల్‌ ఉండే భవనంలోని మొదటి అంతస్తులోకి 2005లో మార్చారు. అప్పుడు రూ.26,250 చెల్లించిన అద్దె కాలక్రమంలో ఇప్పుడు రూ.70 వేలకు చేరింది. అయినా ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ యాజమాన్యం నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ భవనంలోని 20 గదులలో విద్యార్థినులకు వసతి కల్పించి విద్యా బోధన చేస్తున్నారు. వాస్తవానికి 480 మంది విద్యార్థినులు ఉండాల్సిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 150 మంది మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అందులో మైనార్టీ విద్యార్థినులు తక్కువకాగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థినులు ఎక్కువగా ఉన్నారు.

విజయవాడ ఏం పాపం చేసుకుంది?
కృష్ణాజిల్లాలో 5 ఏపీ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో నిమ్మకూరు, ముసునూరు, పులిగడ్డ పాఠశాలలకు కొన్ని ఎకరాల స్థలంలో సొంత భవనాలు ఉన్నాయి. మచిలీపట్నం పాఠశాల కోసం సుమారు 12 ఎకరాల స్థలం కేటాయించగా భవన నిర్మాణం జరగాల్సి ఉంది. అలాగే నిమ్మకూరులోని గురుకుల కళాశాలకు కూడా సొంత భవనం ఉంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సొంత భవనాలు ఉండగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ ఏం పాపం చేసుకుందో అర్ధం కావడం లేదని ప్రిన్సిపాల్‌ ఆంధ్రవాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ డిగ్రీ కళాశాల ఉన్న 25 ఎకరాల (వక్ఫ్‌) భూమిలో కొంత ఈ పాఠశాలకు కేటాయించవచ్చు. లేదంటే భవానీపురం దర్గా వద్ద కార్పొరేషన్‌ స్వాధీనంలో ఉన్న 2.9 ఎకరాల స్థలాన్నైనా ఈ గురుకుల పాఠశాలకు కేటాయించవచ్చు.

భవనం దొరికే వరకు ఇబ్బంది పెట్టవద్దు
తమ భవనాన్ని ఖాళీ చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించిన నేపథ్యంలో ఏడాది నుంచి భవనం కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇటీవల స్కూల్‌ పునఃప్రారంభంకాగా మళ్లీ వచ్చి నెల రోజుల్లో ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ సెక్రటరీ నాగభూషణ శర్మ పర్యవేక్షణలో భవనం కోసం అన్వేషిస్తున్నాం. దయచేసి భవనం దొరికే వరకు ఇబ్బంది పెట్టవద్దని, పిల్లలు ఇబ్బంది పడతారని అర్టీసీ ఎండీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో నూతనంగా ఏర్పాటైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమైనా గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించాలని కోరుతున్నాం.      
– వి. ఆంధ్రవాణి, ఏపీ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌.

మరిన్ని వార్తలు