‘వెలిగొండ’లో విస్తుగొలిపే అవినీతి

30 May, 2018 03:47 IST|Sakshi

     కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడి సంస్థకు రూ.89.50 కోట్ల పనులు అప్పగింతకు ముఖ్యనేత ఒత్తిడి 

     నామినేషన్‌పై పనులు అప్పగిస్తూ ఉత్తర్వుల జారీకి కసరత్తు 

     ఇప్పటికే శ్రీనివాసరెడ్డి సంస్థకు దొడ్డిదారిన రూ.91.52 కోట్ల విలువైన పనులు 

     చేయని పనులకు రూ.11.67 కోట్లు చెల్లించిన అధికారులు 

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల(సొరంగాల) పనుల్లో ముఖ్యనేత, మరో కీలక మంత్రి అందిన కాడికి మింగేయాలని తహతహలాడుతున్నారు. మొదటి టన్నెల్లో రూ.89.50 కోట్ల విలువైన పనులను వైఎస్సార్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆర్కే ఇన్‌ఫ్రా సంస్థకు నామినేషన్‌ విధానంలో కట్టబెట్టాలంటూ అధికారులపై ముఖ్యనేత ఒత్తిడి తెస్తున్నారు. పాత కాంట్రాక్టర్‌ నుంచి 60సీ నిబంధన కింద ఈ పనులను తొలగించాలంటే స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని చెబుతున్నా లెక్కచేయడం లేదు. కావాల్సిన వారికి పనులు కట్టబెట్టి, కమీషన్లు నొక్కేయాలన్నదే వారి అసలు వ్యూహం. 

నామినేషన్‌పై అప్పగించాలట! 
వెలిగొండ ప్రాజెక్టును డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గడువు తక్కువగా ఉంది, పనులు త్వరగా పూర్తి కావాలనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై వేటు వేసింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.601.49 కోట్లు పెంచేసింది. అస్మదీయులైన కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించి రూ.300 కోట్లకు పైగా కమీషన్లు కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ఇటీవల టెండర్లు నిర్వహించారు. మొదటి టన్నెల్‌లో కొన్ని పనులే మిగిలిపోయాయి. వీటి విలువ రూ.25.43 కోట్లకు మించదు. ఆ పనులపై టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి కన్ను పడింది. దాంతో సదరు పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, శ్రీనివాసరెడ్డి సంస్థకు నామినేషన్‌పై అప్పగించాలని ముఖ్యనేత ఆదేశించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక రూ.89.50 కోట్ల విలువైన పనులను శ్రీనివాసరెడ్డి సంస్థకు నామినేషన్‌పై అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.  

సీఎస్‌ అభ్యంతరాలు బేఖాతర్‌ 
వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్, అప్రోచ్‌ చానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల తవ్వకం పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్‌ నుంచి మినహాయించకుండానే గతేడాది మార్చి 23న ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. ముఖ్యనేత, కీలక మంత్రి బెదిరింపుల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి సంస్థ మినహా ఇతరులెవరూ బిడ్‌ దాఖలు చేయలేదు. దాంతో సింగిల్‌ బిడ్‌నే ఆమోదించాలంటూ హైపవర్‌ కమిటీకి వెలిగొండ అధికారులు ప్రతిపాదనలు పంపారు. భారీ పనులు చేసే సామర్థ్యం లేని ఆర్కే ఇన్‌ఫ్రాకు రూ.91.52 కోట్ల విలువైన పనులను ఎలా అప్పగిస్తారంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదిర్శ దినేష్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్కే ఇన్‌ఫ్రాకు అప్పట్లో రూ.91.52 కోట్ల పనులను దొడ్డిదారిన అప్పగించగా, ఇప్పుడు రూ.89.50 కోట్ల విలువైన పనులు నామినేషన్‌పై కట్టబెడుతుండడం వెనుక లోగుట్టు ఏమిటన్నది తెలిసిందే. 

చేయని పనులకు రూ.11.67 కోట్లు చెల్లింపు 
సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్‌ మీదుగా పడవపై కొల్లం వాగుకు చేరుకోవాలి. కానీ, భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా ఆర్కే ఇన్‌ఫ్రా మాయాజాలం ప్రదర్శించింది. ఆ సంస్థతో కుమ్మక్కైన అధికారులు చేయని పనులు చేసినట్లు రూ.11.67 కోట్లు చెల్లించేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. కానీ, ముఖ్యనేత రంగ ప్రవేశంతో విచారణ ప్రాథమిక దశలోనే అటకెక్కింది.    

మరిన్ని వార్తలు