కౌంటింగ్‌ రోజు రగడకు కుట్ర

3 May, 2019 11:44 IST|Sakshi
తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న ఫారం 17సిలు

ఖాళీ ఫారాలపై సంతకాలు చేయమన్న ఆర్‌ఓ

తామెలా చేస్తామంటున్న ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు

17 సి రెండో కాపీ కోసం అడిగారంటున్న తహసీల్దార్‌

కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేస్తున్న రాజకీయపక్షాలు

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా పనిచేస్తున్న మసూమా బేగం ఎన్నికల నిర్వహణలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ నామినేషన్‌ ఆమోదంలోనే విమర్శలు ఎదుర్కొన్న ఆర్‌ఓ ఎన్నికల రోజు ఈవీఎంలు మొరాయించినా వాటి స్థానంలో కొత్తవి మార్చడంలో నిర్లక్ష్యం వహించి సమయం వృథా చేయడంతో చివరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు ధర్నాలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆర్‌ఓ కొత్తగా మరో నిర్ణయంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా కౌంటింగ్‌లో కీలకమైన 17సి ఫారాలను తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించి కొత్తగా ప్రిసైడింగ్‌ ఆఫీసర్లను ఖాళీ ఫారాలపై సంతకాలు చేయమని ఒత్తిడి తేవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల ఓటింగ్‌ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ బూత్‌లో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. పురుషుల ఓట్లెన్ని, మహిళల ఓట్లెన్ని అనే పూర్తి వివరాలతో పాటు ఎన్నికల నిర్వహణలో 33 అంశాలను ఫారం 17సిలో చేర్చి రాజకీయపార్టీల ఏజెంట్లతో సాక్షి సంతకాలు చేయించుకుని ఒకటి ఈవీఎంతో పాటు స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరచి మరో కాపీ ఆర్‌ఓకి అందజేస్తారు.

ఎన్నికల కౌంటింగ్‌ రోజు ఫారం 17సిలతో స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న ఫారం 17సిలు సరిపోల్చడంతో పాటు ఈవీఎంలోని ఓట్ల వివరాలు ఫారం 17 సితో సరిపోల్చి లెక్కిస్తారు. ఇంత ముఖ్యమైన ఫారం 17సిలను పోలింగ్‌ రోజు ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల నుంచి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన ఆర్‌ఓ పోలింగ్‌ రోజు విధులు నిర్వహించిన అధికారులు తమ జీతభత్యాల కోసం గురువారం తహసీల్దార్‌   కార్యాలయానికి రాగా, ఫారం 17సి రెండో కాపీ అడిగారు. తాము అది ఆరోజే ఎన్నికల అధికారులకు అందజేశామని తమ వద్ద లేదని చెప్పడంతో అలాగైతే ఖాళీ ఫారాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. ఖాళీ ఫారాలపై సంతకాలు ఎలా చేస్తామని, గత నెల 11వ తేదీన ఓటింగ్‌ జరగ్గా ఇప్పటివరకు వివరాలు తమకు ఎలా గుర్తుంటాయని తాము చేయలేమనడంతో వివాదం చెలరేగింది. దీంతో కొందరు ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు తాము ఖాళీ ఫారాలపై సంతకాలు చేయలేమని తేల్చిచెప్పడంపై ఆర్‌వో మండిపడినట్లు తెలిసింది.

మరికొందరు సంతకాలు చేసి తమ జీతభత్యాలను తీసుకున్నారు. అయితే ఖాళీ 17సి ఫారాలపై సంతకాలు తీసుకోవడంపై అధికారపార్టీ కుట్ర ఉందని మిగిలిన రాజకీయపక్షాలు అనుమానిస్తున్నాయి. చినబాబు లోకేష్‌కు ఓటమి తప్పదని తెలిసి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి కౌంటింగ్‌ ప్రక్రియలో అలజడి సృష్టించేలా అధికారపార్టీ నాయకులు కుట్ర చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే కౌంటింగ్‌ రోజు మిగిలిన రాజకీయపక్షాలు మరింత జాగ్రత్త వహించి కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేలా చూసుకోవాలని, లేదంటే అధికార పార్టీ చినబాబు గెలుపు కోసం ఎంతకైనా తెగించే అవకాశాలున్నాయని, అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టి కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా ముగిసేలా ఎన్నికల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.

ఈ విషయమై తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్నికల రోజు ఓటింగ్‌ ఆలస్యం కావడంతో కొందరు ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల నుంచి ఫారం 17 సి సేకరించలేకపోయామని, తమకు జిరాక్స్‌ ఇవ్వాల్సి ఉండగా ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు కొందరు ఇవ్వని కారణంగా రెండో కాపీ కోసమే సంతకాలు అడిగామని చెప్పారు. అంతకు మించి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రెండో కాపీ తమ వద్ద ఉండాలనే కారణంతోనే తాము అడిగామని, స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న ఫారం 17సితోనే లెక్కింపు ప్రారంభమవుతుందని, దానిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. లెక్కింపు ప్రక్రియకు తాము సేకరించే ఫారం 17సికు ఎలాంటి సంబంధం లేదన్నారు.

మరిన్ని వార్తలు