ఉద్యోగంలోంచి తొలగించి చర్యలు తీసుకోండి!

21 Nov, 2019 10:58 IST|Sakshi
డీఈవో సుబ్బారావుకు వినతిపత్రం సమర్పిస్తున్న బీటీఏ నాయకులు   

సాక్షి, ఒంగోలు : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అసిస్టెంట్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ ఆళ్ల శేషయ్యను ఆ పోస్టు నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కోరారు. బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్ద కాలంగా శేషయ్య అనే ఉపాధ్యాయుడు బోధనేతర కార్యక్రమంలో అక్రమంగా కొనసాగుతున్నారన్నారు. గతంలో తర్లుపాడులో ఎస్‌జీటీగా పనిచేస్తూ పాఠశాలకు హాజరు కాకుండా కార్యాలయానికి హాజరవుతుండేవారన్నారు. పదేళ్ల నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి కౌన్సిలింగ్‌కు పది నిమిషాల ముందు డీఈవోకు అందజేస్తారన్నారు.

మెరిట్‌ కం రోస్టర్‌ విధానంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు తయారు చేయల్సి ఉండగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు మేలుచేసే విధంగా రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జీవోలను వక్రీకరిస్తూ, అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్నుత్న ఏపీవోపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్రె వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల శరత్‌చంద్రబాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు పేరాబత్తిన జాలరామయ్య, జిల్లా కార్యదర్శి పాలేటి సువర్ణబాబు, నాయకుడు పల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు