క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..

21 Nov, 2019 11:06 IST|Sakshi

చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు  

మానసిక ఒత్తిడిలో మహిళలు, యువకులు

మూడేళ్లలో 251 మంది బలవన్మరణం 

క్షణికావేశం నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. ఓ చోట ఎన్నోఆశలతో పెంచిన కొడుకు, మరోచోట కడవరకు తోడుంటానంటూ ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్త, ఇంకోచోట అన్నీతానై కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటిపెద్ద... ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారంగా భావించి తనువు చాలిస్తున్నారు. కుటుంబసభ్యులకు తీరని మనోవేదన మిగుల్చుతున్నారు.  

సాక్షి, వనపర్తి: చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి లోనవుతూ...ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా..ప్రేమ విఫలమైనా కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం.. వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం...ఆ వ్యక్తి కుటుంబంలో పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తోంది. చనిపోతున్న వారిలో మహిళలు, పురుషులే కాకుండా యువకులే ఎక్కువగా ఉన్నారు.  కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్‌ రికార్డులు చెబుతున్నాయి.  

ఇవీ లక్షణాలు... 
ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధచూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఆందోళన, నిద్రలేకుండా ఉండటం, కంగారు పడటం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తండ్రి బైక్‌ కొనివ్వలేదని కొడుకు.. ఉద్యోగం రాలేని నిరుద్యోగి... పరీక్షా తప్పానని వి ద్యార్థి... భర్త తిట్టాడని భార్య.. భార్య కాపురానికి రాలేదని భర్త... చేయని నేరానికి నిందమోపారని ఒకరు...ఆరోగ్యం బాగోలేదని మరోకరు ఇలా క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  

18నుంచి 35 ఏళ్లలోపు వారే.. 

ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 18 నుంచి 35ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారమార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, చిన్న చిన్నగొడవలు, భూసమస్యలు, ఆస్తి తగాదాలు, ఇలా కారణం ఏదైనా ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. 2017లో 82మంది క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోగా..అందులో 23మంది మహిళలు, 59మంది పురుషులు ఉన్నారు. అలాగే 2018లో 107 ఆత్మహత్య చే సుకోగా ..అందులో 33మంది మహిళ లు, 74మంది పురుషులు ఉండగా... 2019లో ఇప్పటివరకు 62మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 18మంది మహిళలు, 46మంది పురుషులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 74మంది మహిళలు, 173మంది పురుషులు ఉన్నారు. ఇందులో యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.   

వివిధ కారణాలతో ఆత్మహత్యలు..  
2019 నవంబర్‌ 3న వనపర్తి మండలం చందాపూర్‌ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలరాజు(28) గత కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై మిషన్‌ భగీరథ ట్యాంకు దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8న మదనాపురం మండలం సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్‌(17) ల్యాబ్‌రూం ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్‌ 9 ఘనపురం మండలం అప్పారెడ్డిపల్లిలో బాష(24) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అక్టోబర్‌ 18న ఘనపురం మండలం సల్కెలాపురంతండాలో పవన్‌(15) విద్యార్థి పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రితోపాటు ఊరు తీసుకెళ్లలేదనే మనస్థాపంతో విద్యార్థి పవన్‌ పురుగులమందు తాగాడని గ్రామస్తులు తెలిపారు. గమనించిన తండావాసులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెబంర్‌ 18న గోపాల్‌పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన పద్మమ్మ (76) తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె భర్త కూడా చనిపోవడంతో  తీవ్రవనస్థాపానికి గురైన పద్మమ్మ ఒంటిపై కిరోసిన్‌ నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గమనించి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మృతిచెందింది. సెప్టెంబర్‌ 17న వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన వెంకటయ్య (40) తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపు మృతిచెందాడు. అప్పులబాధ ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సెప్టెంబర్‌ 10న వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి తిరుపతమ్మ కుటుంబసమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది.   

సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి  
ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. వారి అభిరుచులు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం శ్రద్ధచూపాలి. సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో ఒంటరిగా ఫీలవుతారు. దీంతో సమాజంలో మెలిగే స్వభావాన్ని కోల్పోయి తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశానికి గురికాకుండా జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించాలి.                        
 – కిరణ్‌కుమార్, డీఎస్పీ, వనపర్తి   

మరిన్ని వార్తలు