మఠం భూములు హాంఫట్‌

25 Aug, 2019 07:55 IST|Sakshi

తిరుమలేశుని కైంకర్యాల కోసం దాతలు హథీరాంజీ మఠానికి కానుకగా సమర్పించిన భూములను భూ రాబందులు తన్నుకుపోయాయి. ఒకప్పుడు మఠం అధీనంలో వేలాది ఎకరాల భూములు ఉండేవి. అవి ప్రస్తుతం వందల ఎకరాలకు చేరుకున్నాయి. కొంతమంది బడా బాబులు లీజు పేరుతో ఈ భూములను తీసుకుని వేల కోట్లకు ఇతరులకు అమ్మేశారు. మిగిలిన భూములను గత ఐదేళ్ల కాలంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గుర్తించి కబ్జా చేశారు. అపార్టుమెంట్లు నిర్మించారు. 

సాక్షి, తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవేంకటేశ్వరస్వామికి పరమభక్తుడు హథీరాంజీ బాబా కొన్ని దశాబ్దాల క్రితమే శ్రీవారి సేవలో తరించారు. టీటీడీ ఏర్పాటుకాక ముందే హథీరాంజీ మఠం ఆధ్వర్యంలోనే శ్రీవారి కైంకర్యాలు జరిగేవి. హథీరాం జీ మఠం ద్వారా నైవేద్యాలు శ్రీవారికి సమర్పించిన తర్వాతనే మిగిలిన కైంకర్యాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన కోసం గతంలో తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో వేల ఎకరాల భూములను దాతలు కానుకగా సమర్పించారు. కొన్నివేల కోట్ల విలువ చేసే ఈ భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. 
►జిల్లాలో హథీరాంజీ మఠం భూములు  సుమారు 1,628.71 ఎకరాలు ఉన్నట్టు ప్రాథమిక అంచనా 
►లీజుకు ఇచ్చినవి 463.17 ఎకరాలు 
►న్యాయస్థానంలో పలు వ్యాజ్యాలలో ఉన్నవి 326.17 ఎకరాలు
►ఆక్రమణకు గురైనవి 446.75 ఎకరాలు 
►ప్రస్తుతం మఠం ఆధీనంలో ఉన్నవి 154.17 ఎకరాలు 

మఠం భూముల ఆక్రమణలో  తెలుగుతమ్ముళ్లదే హవా
గత ఐదేళ్లలో సుమారు 500 ఎకరాలకు పైగా తెలుగు తమ్ముళ్లు హథీరాంజీ భూములను ఆక్రమించుకుని పెద్దపెద్ద భవనాలు నిర్మించారు. ఇందులో తిరుపతి చెందిన పలువురు టీడీపీ బడా నాయకులు ఉన్నారు. సాక్షాత్తు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సైతం 7 ఎకరాల మఠం భూములను ఆక్రమించుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం మఠం భూముల విషయంలో తెలుగు తమ్ముళ్లకు వత్తాసు పాడుతూ వచ్చింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ సైతం మఠం భూముల విషయంలో పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గత పది సంవత్సరాల్లో వేల ఎకరాల మఠం భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పద్మావతీ నగర్, తిరుచానూరు, ముత్యాలరెడ్డిపల్లి, బైరాగిపట్టెడ వంటి ప్రాంతాల్లోని మఠం భూములు రెండు మూడు చేతులు మారినట్టు సమాచారం.

విచారణ చేపడుతున్నాం
హథీరాంజీ మఠం భూములు వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దేవదాయశాఖ, హథీరాంజీ మఠం అధికారులతో, రెవెన్యూ సిబ్బందితో మరోమారు సమావేశమై మఠం భూములను గుర్తిస్తాం. దీంతోపాటు లీజుకు ఇచ్చిన భూముల విషయంలోనూ సమగ్ర విచారణ జరుపుతాం. దురాక్రమణకు గురైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటాం. కబ్జాదారులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు.    
– వి.కనకనరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి 

మరిన్ని వార్తలు