ఉప ఎన్నిక ఖాయం

27 Aug, 2014 03:04 IST|Sakshi
ఉప ఎన్నిక ఖాయం

నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు
నేడు నామినేషన్  

 
నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో  పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ పెట్టకూడదని ఒక సంప్రదాయం ఉంది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను టీడీపీ అధిష్టానంతో సహా నాయకులంతా సౌమ్య ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు.  ఇతర రాజకీయ పార్టీలు ఎవ రూ పోటీ చేయరని మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు భావించారు. కానీ     కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నందిగామ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడపాటి బాబురావును పోటీలో దింపుతున్నట్లు ప్రకటించడంతో పోటీ అనివార్యం కానుంది.

చిన్న, చితకా పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయకుండా ఉంచేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని బుజ్జగించి నామినేషన్లు వేయకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ   అవాక్కయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మధ్య గట్టి పోటీ జరిగింది. తంగిరాల ప్రభాకరరావు 5212ఓట్లతో విజయం సాధించారు. కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించారు.  
 
 

మరిన్ని వార్తలు