జీసీసీకి పూర్వవైభవం

26 Feb, 2015 00:22 IST|Sakshi

వ్యాపార విస్తరణకు ప్రణాళికలు
మరిన్ని అవుట్‌లెట్ల ఏర్పాటుకు సన్నాహాలు
అంతర్జాతీయ మార్కెట్‌లోకి సంస్థ ఉత్పత్తులు

 
గిరిజనుల అభ్యున్నతికి విశాఖపట్నం కేంద్రంగా 54 ఏళ్ల క్రితం ఏర్పడిన గిరిజనసహకార సంస్థ(జీసీసీ) సహకార రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయమార్కెట్‌లో తన దైన ముద్ర వేసుకునేందుకు అడుగులేస్తోంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎమ్‌డీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ జీసీసీ ఉత్పత్తులకు గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

విశాఖపట్నం: ఏజెన్సీలో గిరిజనులు సేకరించే ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తోంది. సంస్థకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 15కు పైగా ఉన్న తయారీ, ప్యాకింగ్ యూనిట్లలో వాటిని మార్కెటింగ్‌కు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా రిటైల్ మార్కెటింగ్ ద్వారా రూ.23.55 కోట్ల లావాదేవీలు సాగిస్తున్న సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.40 కోట్లు వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఏపీలో 25 సొసైటీల ద్వారా 541 షాపులను ఏర్పాటు చేసి గిరిజనులకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నది. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా వందకు పైగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వెయ్యికి పైగా రిటైల్ అవుట్ లెట్లలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించింది.

పుణ్యక్షేత్రాల్లో జీసీసీ అవుట్‌లెట్స్

జిల్లా కేంద్రాలతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో మరో రెండు నెలల్లోనే ప్రత్యేక అవుట్‌లెట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. అలాగే రాష్ర్ట వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవస్థానాల్లో అవుట్‌లెట్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈమేరకు అనుమతులకు  దేవాదాయశాఖ కమిషనర్‌కు జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రవిప్రకాష్ లేఖ రాశారు. కమిషనర్ నుంచి అనుమతులు రాగానే తమ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అన్ని దేవస్థానాల్లో కౌంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రానున్న గోదావరి పుష్కరాల్లో  రాజమండ్రితో పాటు పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవుట్‌లెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇలా వ్యాపారాన్ని విస్తరించు కునేందుకు సన్నాహాలు చేస్తోంది.

అంతర్జాతీయమార్కెట్‌లోకి జీసీసీ ఉత్పత్తులు

ఇప్పటికే జిల్లాలో ఆన్‌లైన్‌సేల్స్ ప్రారంభించిన జీసీసీ త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అనుభవం ఉన్న సర్వీస్ ప్రొవైడర్ల అన్వేషణ ప్రారంభించింది. వీరికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని జీసీసీ అందించనుంది. వీరి ద్వారా ఈ కామర్స్‌లో వ్యాపారం చేసే ప్లిప్‌కార్ట్, ఎమజాన్, ఈ-బే, స్నాప్‌డీల్, సాత్విక్‌షాప్ తదితర ఆన్‌లైన్ ఏజెన్సీలతో టైఅప్ పెట్టు కుని జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించనుంది. సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. మరో పదిహేను రోజుల్లో ఇవి ఖరారు అవుతాయి. సర్వీస్ ప్రొవైడర్లు వారు చేసే వ్యాపారాన్ని బట్టి పర్సంటేజ్ ఇవ్వాలని జీసీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నం విజయవంతం అయితే గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించిన కార్పొరేషన్‌గా   ఖ్యాతి గడించనుంది.
 
వ్యాపార విస్తరణే లక్ష్యం

గిరిజను సేకరించే అటవీ ఉత్పత్తులకు మంచిధరతో కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు..ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా జీసీసీ కృషి చేస్తున్నది. అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ఉత్పత్తులన్నీ కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయంతో వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం.
 -ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, జీసీసీ
 
మార్కెట్‌లోకి  కొత్త ఉత్పత్తులు

ఇప్పటికే  తేనె, చింతపండు, షికాకాయి, కుంకుడుకాయ, ఉసిరి ఫౌడర్స్,రాజ్మా, అలోవిరా, టెర్మరిక్, నీమ్, హనీసోప్స్, డ్రైచిల్లీ ఫౌడర్, సోయాబీన్ ఫౌడర్,సోయా బీన్ మిల్క్ మేకింగ్, కాఫీ ఫౌడర్ వంటి 25రకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి జీసీసీ ప్రవేశపెట్టింది. త్వరలో షికా కాయి షాంపు, కుంకుడుకాయ షాంపు, జాస్మిన్ సోప్స్, త్రిపులచూర్ణం, త్రిపుల జ్యూస్ వంటి మరో ఐదు ఉత్పత్తులను త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు జీసీసీ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల నుంచే ఈ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు