ఇళ్లకొచ్చి బెదిరింపులు.. సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన

21 Dec, 2023 07:55 IST|Sakshi
ప్రజలు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో పోలీసుల ప్రచారం

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇళ్లకు వచ్చి బెదిరింపులు 

ఆధార్‌ కార్డు ఇవ్వాలని, ఓటీపీ చెప్పాలని బలవంతం

అపరిచితులకు సమాచారం ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు అర్బన్‌: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లకు వచ్చి, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఆధార్‌ కార్డులు చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులకు తెగబడుతున్నారు.

ముఖ్యంగా ఏలూరు, తణుకు నగరాల్లో వీరు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్‌ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన టీడీపీ.. ఇప్పుడు తమ ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  ఇటీవల ఏలూరు పత్తేబాదలోని ఓ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆధార్‌ కార్డు కావాలంటూ అడిగారు. మీరెవరని ప్రశ్నించగా టీడీపీ నుంచి వచ్చామని, ఆధార్‌ కార్డు ఇస్తే యాప్‌లో వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.

ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ దురుసుగా అడిగారు. మీకెందుకివ్వాలంటూ ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆమెను బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఏలూరు కొత్తపేటలోనూ ఇదే విధంగా పలు ఇళ్లలో ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ చెప్పాలని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు డిమాండ్‌ చేశారు. స్థానికులు గట్టిగా ఎదురు తిరగడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా దెందులూరు, ఉంగుటూరు, తణుకులో కూడా టీడీపీ, జనసేనకు చెందిన పలువురు స్థానిక నాయకులు కొందరు యువకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు.

తణుకులోనూ ఓటరు లిస్టుతో ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతూ బాబు గ్యారంటీ కార్డులు అందజేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వెంటనే చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. బుధవారం 8, 17 వార్డుల్లో ఇలాగే బెదిరించిన టీడీపీ కార్యకర్తలపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి, హెచ్చరించి పంపించారు. 

వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక 
ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాలు పెరిగిపోతు­న్న ప్రస్తుత తరుణంలో అపరిచితులు ఎవరికీ వ్య­­క్తిగత సమాచారం, ఆధార్‌ కార్డులు, ఓటీపీ నం­బర్లు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్ర­జలు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరికీ చెప్పవద్దని వాటి కోసం బలవంతం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. 

వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన పవన్‌.. ఇప్పుడిదేం పని? 
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అండదండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకొనేందుకు వెళ్లిన వాలంటీర్లపై నానా రకాల ప్రచారం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం నియమించిన వారు.

అదే ప్రాంతానికి చెంది, నిత్యం ప్రజల మధ్య ఉండి, వారికి సుపరిచితులైన వారు. అలాంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధంగా అందేలా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తే తప్పంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు అదే జనసేన, టీడీపీ వారు ఆ ప్రాంతానికి సంబంధం లేని వారిని, అపరిచితులను ఇంటింటికీ పంపి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇవ్వని వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అపరిచిత వ్యక్తులు వస్తున్నారు 
అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి ఆధార్‌ కార్డు కావాలని అడుగుతున్నారు. ఫోన్‌ నంబర్లకు ఓటీపీలు వస్తా­యని అవి చెప్పాలని అడుగుతున్నారు. మీకెందుకని అడిగితే టీడీపీ యాప్‌లో నమోదు చేయాలని అంటున్నారు. వారి తీరుతో మాకు భయంగా ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.  
– బి.మణి, వన్‌టౌన్, ఏలూరు 

చదవండి: ఇదీ.. జగన్‌ కమిట్‌మెంట్‌ 

>
మరిన్ని వార్తలు