అర్ధరాత్రి ఆలయ ప్రహరీ కూల్చివేత

4 Jan, 2014 02:25 IST|Sakshi

పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్ : పత్తికొండ గ్రామదేవతలైన అంకాలమ్మ, బంగారమ్మ ఆలయ ప్రహరీని స్థానికులు అర్ధరాత్రి కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ప్రహరీ నిర్మాణం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఉదయం ఆర్‌డీఓ ఆదేశాల మేరకు తహశీల్దారు రామక్రిష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆలయం వద్దకు వెళ్లి ఇంటి నివాసానికి ఇబ్బందిగా ఉన్న కొంత భాగాన్ని మాత్రమే తొలగించారు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకున్న స్థానికులు బాబు, వడ్డే భాగ్యప్ప, చాకలి రంగన్న, రామాంజినేయులు, వడ్డే శ్రీను, తెలుగు శ్రీను ప్రహరీ మొతాన్ని తొలగించాలని పథకం వేశారు.

రాత్రి వేళ జేసీబీ యజమాని వద్దకు వెళ్లి తహశీల్దారు రామక్రిష్ణ మిగిలిన గోడను కూడా కూల్చివేయమన్నాడని అబద్ధం చెప్పారు. రాత్రి సమయంలో ఎందుకని పొక్లెయిన్ యజమాని, డ్రైవర్ వారిస్తున్నా పట్టించుకోకుండా జేసీబీని ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. అధికారుల పేరుతో భయపెట్టి మిగిలిన ప్రహరీని కూడా కూల్చివేయించారు. శుక్రవారం ఉదయంలోపు ఈ విషయం గ్రామం మొత్తానికీ తెలిసిపోయింది. దీంతో 12 ఆయకట్ల రైతులు, గ్రామప్రజలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. మరికొంత మంది ప్రజలు ప్రహరీని కూల్చిన వారి ఇళ్లపైకి దాడి చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆ సమయంలో సీఐ శ్రీధర్, ఎస్‌ఐ ప్రియతమ్‌రెడ్డి, తహశీల్దారు రామక్రిష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయం వద్ద గుమికూడిన గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు. ఆలయ కమిటీ పెద్దలు ఎల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులతో అధికారులు చర్చించారు. ప్రహరీని తొలగించేందుకు ఉపయోగించిన జేసీబీని అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేసిన దుండగుల్లో కొందరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఎస్‌ఐ ప్రియతమ్ రెడ్డి న్యూస్‌లైన్‌కు తెలిపారు.

>
మరిన్ని వార్తలు