దిక్కులేని స్థితిలో సినీ పరిశ్రమ

14 Sep, 2014 02:18 IST|Sakshi
దిక్కులేని స్థితిలో సినీ పరిశ్రమ
  • ప్రముఖ సినీ నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి
  • మావిచిగురు తినగానే కోయిల పలికేనా.. అంటూ ‘సీతామహాలక్ష్మి’ సినిమాలో స్టేషన్ మాస్టార్‌గా పాట పాడిన వ్యక్తి మీకు గుర్తున్నారా.. ఆయనే ఈయన. పేరు వంకాయల సత్యనారాయణమూర్తి. దేశోద్ధారకుడు, జానకిరాముడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. ప్రస్తుతం కౌతవరంలో జరుగుతున్న ‘ఈ నేల- ఈ గాలి’ సీరియల్ షూటింగ్ పాల్గొనేందుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమలో నటులు, సాంకేతిక నిపుణులు తెలంగాణ ప్రభుత్వం  వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయన శనివారం ‘సాక్షి’కి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ దిక్కులేని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.         
     - కౌతవరం (గుడ్లవల్లేరు)
     
     ప్రశ్న :
    ‘సీతామహాలక్ష్మి’ సినిమా మీకు మంచి పేరేతెచ్చినట్టుంది?
     జవాబు : 1978లో ‘సీతామహాలక్ష్మి’ సినిమాలో స్టేషన్ మాస్టారుగా నటించాను. 36ఏళ్లు గడుస్తున్నా నన్నింకా అందరూ సీతామహాలక్ష్మి స్టేషన్ మాస్టారుగానే పలకరిస్తారు.
     
     ప్రశ్న :
    ఇప్పటివరకు ఎన్ని సినిమాలు, సీరియల్స్‌లో నటించారు?
     జవాబు : తెలుగులో 174, తమిళంలో మూడు, హిందీలో మూడు సినిమాల్లో నటించాను. అలాగే, తెలుగులో 50, తమిళంలో 12 సీరియల్స్ చేశాను.
     
     ప్రశ్న : ఆంధ్రా నటులపై తెలంగాణ సర్కార్ వివక్ష చూపుతోందంటున్నారు. కారణం?
     జవాబు : కేవలం నటులే కాదు. ఆంధ్రావాళ్లంటేనే తెలంగాణ ప్రభుత్వం హీనంగా చూస్తోంది.
     
     ప్రశ్న :
    ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది?
     జవాబు : దిక్కులేక అద్దె కొంపలో తెలుగు పరిశ్రమను బతికించుకునేంతగా ఉంది.
     
     ప్రశ్న : కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమ వస్తుందంటారా..
     జవాబు : తెలంగాణలోని ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి పరిశ్రమను ఆంధ్రాకు తరలిద్దామని సినీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. కానీ రావటానికి అవసరమైన వనరుల్ని కల్పించాలి.
     
     ప్రశ్న : ఎప్పటికి అది సాధ్యమవుతుంది?
     జవాబు : రాత్రికిరాత్రి పరిశ్రమను మార్చేయటం కుదరదు. నెమ్మదిగా ఆంధ్రాలోకి తీసుకురావాలి. కోట్లాది సినీ ప్రముఖుల ఆస్తులు  తెలంగాణ పాలయ్యాయి.
     
     ప్రశ్న :
    ఆంధ్రాలో పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి?
     జవాబు : సింగిల్ విండో పద్ధతిని అనుసరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
     

మరిన్ని వార్తలు