గాలింపు ముమ్మరం

26 Jun, 2015 02:36 IST|Sakshi

రేగిడి : మండల పరిధిలోని సంకిలి నాగావళి నదిలో రాజాం మండలం బుచ్చెంపేటకు చెందిన కోరాడ తిరుపతిరావు ఆచూకీ కోసం అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిరావు ఈ నెల 24న గల్లంతైన విషయం విదితమే. గురువారం తెల్లవారు నుంచే ఎస్సై ఎన్.కామేశ్వరరావు,  సిబ్బందితోపాటు సంఘటన స్థలం వద్దే ఉండి గాలింపు చర్యలను చేపట్టారు. ఏ ప్రాంతంలో సంఘటన జరిగిందో తెలుసుకునేందుకు మంగళవాపురానికి చెందిన వడ్డాది వినేద్, పొనుగుటివలసకు చెందిన పూతిక సింహాచలంలను కూడా ఆ ప్రాంతానికి తీసుకువెళ్లారు.
 
 గ్రామానికి చెందిన సుమారు 300 మంది వరకు నదివద్దకు వచ్చి తిరుపతిరావు ఆచూకీ లభ్యంకాకపోవడంతో ఆందోళన చెందారు. ఒక వ్యక్తి నదిలో గల్లంతైనప్పటికీ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది సంఘటన స్థలం వద్దకు రాలేదని వాపోయారు. తహశీల్దార్ బి.సూరమ్మ కూడా నది వద్దకు వెళ్లి ఎస్సైతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. నది దిగువ భాగంలోనూ గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.  ఇటీవల హుద్‌హుద్ తుపాను ప్రభావంతో వచ్చిన వరదకు పాతవంతెన వద్ద పూర్తిగా కోతకు గురికావడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఇక్కడ జీఎంఆర్ ఐటీ విద్యార్థి స్నానానికి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే.
 
 గజ ఈతగాళ్లను రప్పించండి
 రేగిడి: సంకిలి నాగావళి నదిలో తిరుపతిరావు గల్లంతయిన విషయాన్ని తెలుసుకున్న ఎంఎల్‌ఎ కంబాల జోగులు గురువారం సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. సంఘటన ఎలా జరిగిందీ స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
 
 బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎస్‌ఐ  కామేశ్వరరావు, తహశీల్దార్ బి.సూరమ్మ తదితర అధికారులను ఆదేశించారు. సంకిలి బ్రిడ్జి నుంచి బొడ్డవలస వరకూ తీరం వెంబడి ఎంఎల్‌ఎ నడుచుకుంటూ వెళ్ళి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. ఆయనవెంట సంకిలి సర్పంచ్ రాయపురెడ్డి కృష్ణారావు తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు