ఇంట్లో చోరీ.. యజమాని అదృశ్యం ప్రాజెక్టులు

19 Sep, 2013 02:33 IST|Sakshi

 మునగపాక, న్యూస్‌లైన్ : ఇంట్లో వారు తిరుపతి వెళ్లారు.. యజమాని మాత్రం ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మరేం జరిగిందో తెలియదు కానీ ఆయన జాడ లేకుండా పోయింది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడంతోపాటు విలువైన సామగ్రి అదృశ్యమయింది. ఇంటి నిండా కారం చల్లి ఉండడంతో ఏం జరిగిందో ఏమిటోనన్న భయం నెలకొంది. మండల కేంద్రమైన మునగపాకలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, ఇంట్లో వస్తువులు పాటు అపహరణకు గురి కావడంతో కలకలం నెలకొంది.

అదృశ్యమైన వ్యక్తి కుటుంబ సభ్యుల, పోలీసుల సమాచారం ప్రకారం.. మునగపాకలోని పల్లపు వీధిలో పొలమరశెట్టి రామచంద్రరావు, అతని భార్య మహలక్షమ్మ నివసిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులున్నారు. కొడుకులిద్దరూ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు అప్పలనాయుడు ఇటీవల మునగపాక వచ్చాడు. కుమార్తెలకు వివాహాలు జరిగినా కుటుంబ కలహాల కారణంగా తల్లితండ్రుల వద్దే ఉంటున్నారు. రామచంద్రరావు భార్య మహలక్షమ్మ, అప్పలనాయుడు, కూతుళ్లు ఈ నెల 10న తిరుపతి పయనమయ్యారు. రామచంద్రరావు మాత్రం ఇంటివద్దే ఉండిపోయారు.

తిరుపతి నుంచి అప్పలనాయుడు గత మూడు రోజులుగా తండ్రికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అనే వస్తూ ఉండడంతో అతడు ఆందోళనతో గ్రామంలోని తన స్నేహితుడు వేగి శివ గణేశ్‌కు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి తండ్రి బాగోగులు వాకబు చేయాలని కోరాడు. గణేశ్ మంగళవారం రాత్రి  రామచంద్రరావు ఇంటికి వెళ్లి చూడగా వంటగది తలుపు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు.

చుట్టుపక్కల వారు వచ్చి, ఇల్లంతా కారం జల్లి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో వస్తువులు చెల్లాచెదుైరె నట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. మునగపాక ఎస్‌ఐ జోగారావు ఆ రాత్రే సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని అదృశ్యమైనట్టు గుర్తించారు. గణేశ్ బుధవారం  ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యక్తి అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 వెండి సామగ్రి మాయం
 రామచంద్రరావు కుటుంబ సభ్యులు బుధవారం  మధ్యాహ్నం తిరుపతి నుంచి ఇంటికి చేరుకున్నారు.
 పోలీసుల సమక్షంలో ఇంట్లో గదులు పరిశీలించగా, ప్రధాన గదిలోని బీరువా తెరిచి ఉన్నట్టు గమనించారు. బీరువాలోని మూడు కిలోల వెండి సామగ్రి, రూ. 10 వేల నగదు, కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయని, అదే గదిలోని ఎల్‌సీడీ టీవీ కూడా కనిపించడం లేదని గుర్తించారు. తిరుపతి వెళ్తూ ఉండడంతో ఇంట్లోని బంగారు నగలను బ్యాంకులోని లాకర్‌లో భద్రపరిచినట్టు రామచంద్రరావు భార్య మహలక్షమ్మ తెలిపారు. ఈ సంఘటనతో మహలక్షమ్మ, కొడుకు, కూతుళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు ఇంటి వద్ద గుమికూడి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు