పంటపొలాల్లో ఇటుకబట్టీలా

27 Mar, 2016 23:33 IST|Sakshi

బీమా చెల్లించిన రైతులకు పరిహారం ఏదీ?
నాలుగు లెసైన్స్‌షాపులకు   48 బెల్ట్‌షాపులా...!
వ్యవసాయ, ఎక్సైజ్‌శాఖాధికారులపై జెడ్పీటీసీల ఫైర్
జెడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా

 

మహారాణిపేట(విశాఖ): జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎక్సైజ్, వ్యవసాయశాఖలను కుదిపేసింది. ఆ రెండుశాఖల అధికారులపై సభ్యులు ధ్యజమెత్తారు. నాలుగు లెసైన్స్ షాపులకు 48 బెల్ట్‌దుకాణాలా? పంటపొలాల్లో ఇసుకబట్టీలా అంటూ నిలదీశారు. చైర్‌పర్సన్ లాలం భవాని అధ్యక్షతన ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతిరాజు మృతికి ప్రారంభంలో సంతాపం తెలిపారు.  వ్యవసాయశాఖ నివేదికను చదివిన వెంటనే ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు లేచి జిల్లాలో 2012 నుంచి రైతులు పంటలకు బీమా చెల్లిస్తున్నప్పటికీ పరిహారానికి నోచుకోలేదని, ఎంతమంది బీమా చెల్లించాలని నిలదీశారు. దీనికి అనుబంధంగా మునగపాక జెడ్పీటీసీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన మండంలో 33వేల ఎకరాల్లో సాగుభూమి ఉందని, ఇందులో 2వేల ఎకరాలు నీరు లేక ఇటుకబట్టీలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటుకబట్టీలకు ఎవరు అనుమతులిచ్చారని ప్రశ్నిం చారు.

ఎస్.రాయవరం ఎంపీపీ వినోద్‌రాజు మాట్లాడుతూ రైతులకు వ్యవసాయశాఖ ఉన్నట్టు తెలియడం లేదన్నారు. పద్మనాభంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ జెడ్పీటీసీ కోరారు. కోటవురట్ల మండంలో ఆదర్శరైతులకు ఏడాదిగా జీతాలివ్వలేదని ఆ మండల జెడ్పీటీసీ సభ దృష్టికి తెచ్చారు. గొలుగొండలో దళారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ మండల జెడ్పీటీసీ జేసీ నివాస్‌ను కోరారు. డీసీసీబీ చైర్మన్ సుకుమారవర్మ మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించకపోవడం వల్లే బ్లాక్‌మార్కెట్లో ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.

 

బెల్ట్‌షాపుల జోరు...

గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, నాలుగు లెసైన్స్ షాపులకు 48 బెల్ట్‌షాపులు చొప్పున ప్రతిమండంలో వీధి వీధికి మద్యం ఏరులై పారుతోందని, సీసాకు రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టిం చు కోవడం లేదని మునగకపాక జెడ్పీటీసీ సభ్యు డు లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. మన్యం లో సారా ఏరులైపారుతోందని ఏజెన్సీ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశంలో పేర్కొన్నారు.

 
ఆస్పత్రుల్లో  సిబ్బంది లేరు.

నర్సీపట్నం ఆస్పత్రిలో ఫ్మార్మాసిస్టులు లేక రోగులకు మందులు ఇచ్చేవారే కరువయ్యారని నర్సీపట్నం జెడ్పీటీసీ తెలిపారు. ఒకే ఒక్క డాక్టర్ ఉండడంతో రాత్రిళ్లు సేవలు అందడం లేదన్నారు. ఆస్పత్రుల్లో ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్.రాయవరం ఎంపీపీ వినోద్‌బాబు సభకు తెలిపారు. రాయవరం ఆస్పత్రి శిథిల స్థితికి  చేరిందన్నారు. భీమిలి మండంలో నాలుగు ఎకరాల స్థలం ఉన్నా పీహెచ్‌సీ భవన నిర్మాణానికి వైద్య, ఆరోగ్యశాఖ ముందుకు రావడం లేదని భీమిలి జెడ్పీటీసీ అప్పారావు ఆరోపించారు. దీనిపై జేసీ నివాస్ వైద్యాధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.


పాఠశాల భవనం పూర్తిచేయరా...
చీడికాడ మండలం తరువోలు జెడ్పీ హైస్కూల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు రూ. 36లక్షలతో చేపట్టిన భవనం ఎప్పుడు పూర్తవుతుందని ఆ మండల జెడ్పీటీసీ పి.సత్యవతి సభ దృష్టికి తెచ్చారు. వసతి కొరతతో విద్యార్థులు చెట్టు నీడన చదువుతున్నారన్నారు.మునగపాక మండలం పాటిపల్లి పంచాయతీ నారాయుడుపాలెంలో ఏడాదిన్నరగా నీటిపథకం మూలకు చేరినా బాగు చేయడం లేదని ఆ జెడ్పీటీసీ వాపోయారు. ఈ సమావేశానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుతో సహా ఎమ్మెల్యేలంతా డుమ్మాకొట్టారు. జేసీ నివాస్, జెడ్పీ సీఈవో ఆర్.జయప్రకాష్ నారాయణ్ తో పాటు వివిధశాఖల అధికారులు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు