ప్రకృతి ప్రకోపం

24 May, 2015 01:14 IST|Sakshi

లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి :ఈ వారం ప్రకృతి ప్రకోపం.. ధనిక, పేద వ్యత్యాసాన్ని దాదాపు రద్దు చేసింది. రోజురోజుకూ విజృంభించిన ఉష్ణోగ్రత అన్ని వర్గాల వారినీ భీతావహుల్ని చేసింది. రాజమండ్రిలో శుక్ర, శనివారాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా వడదెబ్బకు 40 మందికి పైగా బలయ్యూరు. శుక్రవారం 14 మంది, శనివారం 23 మంది మృతి చెందారు. వడగాడ్పుల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వైద్యులు పీహెచ్‌సీ స్థాయిలోనైనా ప్రజలకు అవగాహన కల్పించగలిగితే ఈ ముప్పును కొంతవరకు తప్పించొచ్చు.
 
 నాటకానికి ఊతమిచ్చిన నంది పండుగ
 కళాకారుల పురిటిగడ్డ రాజమహేంద్రిలో జరుగుతున్న నంది సందడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులను చాలా కాలం తరువాత ఒకచోట కలిసేలా చేయడం సంతోషించదగ్గ పరిణామం. వారం రోజులుగా రోజుకు నాలుగు నుంచి ఆరు వరకు ప్రదర్శితమవుతున్న నాటకాలు సందేశాత్మకంగా నిలుస్తున్నాయి. టీవీల్లో ప్రచారం కల్పించడం, టిక్కెట్టుతో నాటకాలు చూసే స్థాయికి వచ్చిన నాడే నాటక రంగానికి, దానిపై ఆధారపడ్డ కళాకారులకు కొత్త ఊపిరి ఊదినట్టు. నాటకోత్సవాల్లో సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తీరు విమర్శలపాలవుతోంది. తానూ ఒక కళాకారుడై ఉండీ..   కొందరు కళాకారులను పొగడ్తలతో ముంచెత్తడం న్యాయ నిర్ణేతలను ప్రభావితం చేయడం కాక మరేమిటో ఆయనే చెప్పాలి.
 
 చదువుల రేసులో వెనుకంజ
 విద్యార్థుల భవిష్యత్‌కు దిక్సూచిగా నిలిచేవి పదోతరగతి, ఎంసెట్ ఫలితాలు. ఈ వారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో గత విద్యాసంవత్సరం సాధించిన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోలేక జిల్లా విద్యాశాఖ చేతులెత్తేసింది. ఉత్తీర్ణత 0.49 శాతం మెరుగుపడటం జిల్లావిద్యాశాఖాధికారి నరసింహారావుకు సంతృప్తినివ్వవచ్చు. కానీ రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు రావడానికి నంబర్ అనేది ఒక గీటురాయి అనే విషయాన్ని గుర్తించకపోవడం సహేతుకమా. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులను జిల్లా విద్యాశాఖ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఎంసెట్ ఫలితాల్లోనూ జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. విభజన తరువాత తొలిసారి ఎంసెట్ నిర్వహించిన జేఎన్‌టీయూకే ఫలితాల వెల్లడిలో ప్రశంసలందుకుంది.
 
 టాప్-10లో జిల్లాకు చోటు లేకపోవడం నిరాశనే మిగిల్చింది. కాకినాడకు చెందిన అన్విత మెడిసన్‌లో 13వ ర్యాంకు, రాయుడుపాలెంకు చెందిన వెల్లంకి సాయిహర్ష ఇంజనీరింగ్‌లో 14వ ర్యాంకులతో జిల్లా పరువు, ప్రతిష్టలను కొంతవరకు నిలబెట్టగలిగారు. అన్ని విధాలుగా వెనుకబడ్డ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు టాప్-10లో నిలవడాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో ఆ మేరకు ఎంసెట్ కోసం పెద్ద కసరత్తే జరగాలి. ఈసెట్, అఖిల భారత స్థాయిలో జరిగిన ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షల ఫలితాలు మాత్రం జిల్లా ప్రతిష్టను ఒక మెట్టు పైకి తీసుకువెళ్లాయి. ఈసెట్‌లో ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన కోదాటి సాయిఫాల్గుణి మొదటి ర్యాంకు, ఎంఎస్‌సీ అఖిలభారత ప్రవేశపరీక్షలో సీతానగరం మండలం కాటవరానికి చెందిన బొల్లి వేణుబాబు జాతీయస్థాయిలో పది, ఏపీలో మొదటి  ర్యాంకులు సాధించారు.
 
 నిర్వాసితులపై ఉక్కుపాదం.. ఇదేం న్యాయం?
 పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన కుటుంబాలను అక్కున చేర్చుకోవాల్సిన సర్కార్ అందుకు భిన్నమైన రీతిలో కర్కశంగా వ్యవహరించడం సహేతుకం కాదు. అంగుళూరు గ్రామం గ్రామాన్నే పోలీసు బలగాలతో బలవంతంగా ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. పట్టిసీమకు ఇచ్చినట్టే సవరించిన భూసేకరణ చట్టం(ఎకరాకు రూ.16 లక్షలు) ప్రకారం ప్యాకేజీని అందించాలంటున్న బాధితులది న్యాయమైన డిమాండే. న్యాయం చేస్తామన్న కలెక్టర్ అరుణ్‌కుమార్ ఎలా చేస్తారు, ఏమి చేస్తారో చూడాలి. రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ అమలులోకి తెచ్చి ఈ వారం మధ్యలో 70 వేల మందికి రేషన్ లేకుండా చేశారు.
 
  ‘పేదల నోటికి ఈ షాక్’ పేరుతో నిరుపేదల పొట్ట కొట్టిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం, జిల్లా యంత్రాంగం స్పందించి మరో రెండు రోజులు గడువు పొడిగింపు ఇవ్వక తప్పింది కాదు. జిల్లాలో రాజకీయంగా ఈవారం పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ జిల్లా కమిటీకి పర్వత చిట్టిబాబు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం టీడీపీ మిత్రపక్షం బీజేపీ నేత సోము వీర్రాజుకు దక్కింది. టీడీపీలో ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ కోసం ఎదురు చూస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో అభ్యర్థిగా ఎంపికయ్యూరు. ఆయన వచ్చే నెలలో జరిగే ఎన్నికల బరిలో నెగ్గుకు రావాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు