హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు.. 'పిండం' సినిమా మరో ఎత్తు: డైరెక్టర్‌

9 Dec, 2023 18:00 IST|Sakshi

‘నల్లగొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. అది మా నాయనమ్మ చెప్పడం వల్ల నాకు బాగా గుర్తుండిపోయింది. దాని చుట్టూ కథ అల్లుకొని, ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచించాను.దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం సినిమా మొదలుపెట్టాను. ఇప్పటి వరకు తెలుగులో చాలా హారర్‌ మూవీస్‌ వచ్చాయి. అవన్ని ఒకెత్తు.. మా పిండం మూవీ మరో ఎత్తు. హారర్‌ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు’అని అన్నారు దర్శకుడు సాయి కిరణ్‌ దైదా.

శ్రీరామ్‌, ఖుషి రవి జంటగా నటించిన తాజా చిత్రం ‘పిండం’.'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సాయికిరణ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

యదార్థ ఘటన చుట్టూ కల్పిత కథ అల్లుకొని ‘పిండం’సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు హారర్ జానర్ సినిమాలు చూడటానికి వచ్చేది భయపడటం కోసమే. ఆ హారర్ అనుభూతిని కలిగించి, భయం ఇవ్వాలి. ఇది నా మొదటి సినిమా కాబట్టి భారీ తారాగణం ఉండదు. కథ బలంగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ని ఎంతో శ్రద్ధతో రాసుకోవడం జరిగింది. హారర్ సినిమా కాబట్టి ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. సినిమా మొత్తం పూర్తయ్యాక, సినిమా చూసుకొని విజయం పట్ల మరింత నమ్మకం కలిగింది.

► పిండం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు పిండాకారం అంటారు. అలాగే ఒక మనిషి చనిపోయాక పెట్టేది కూడా పిండం అనే అంటాం. అసలు అది ఏంటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథలో కోర్ పాయింట్ అదే. నేను కథ రాసుకున్నప్పుడే పిండం టైటిల్ అనుకున్నాం. ఇలాంటి నెగటివ్ టైటిల్ ఎందుకు, అసలే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అని నా టీమ్ మెంబర్స్ కూడా పిండం టైటిల్ మార్చమన్నారు. అయితే ఒక మూఢ నమ్మకాన్ని పట్టుకొని, కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ని కాదని వేరే టైటిల్ పెట్టడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది. 

ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్ చదివాను. సబ్జెక్ట్ లోకి మరింత లోతుగా వెళ్ళడం కోసం అంతగా రీసెర్చ్ చేశాను. ఎప్పుడూ వచ్చే హారర్ సినిమాల్లాగా కాకుండా, కొత్తగా ఎలా చూపించాలి అనే దానిపై ఎంతో వర్క్ చేశాము. క్లైమాక్స్ సన్నివేశంలో.. వివిధ భాషల్లో ఉండే నిజమైన మంత్రాలను తెలుసుకొని పెట్టడం జరిగింది.

► టీజర్ కి, ట్రైలర్ కి రెండింటికీ మంచి స్పందన వచ్చింది. కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది. ట్రైలర్ చూసి ఎందరో అభినందించారు. మీరు టీజర్, ట్రైలర్ లో చూసిన దానికంటే ఎన్నో రెట్ల కంటెంట్ సినిమాలో ఉంటుంది.

► ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన హారర్ సినిమాలన్నీ ఒక ఎత్తు. మా పిండం సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏదో భయపెట్టాలని ఒక హారర్ సీన్ పెట్టడం అలా ఉండదు. బలమైన కథ ఉంటుంది. స్క్రీన్ కి అతుక్కొని మరీ చూస్తారు. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలకు మనం ఎంతలా కనెక్ట్ అయితే, భయం అనేది అంత బాగా పండుతుంది. ఊరికే ఏదో హారర్ పెట్టాలి అన్నట్టుగా ఉండదు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే భయం ఇంకా ఎక్కువ పండుతుంది. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలకి ట్రెండ్ కూడా బాగుంది. మాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాం.

ఈ సినిమాలో సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది.

త్వరలో  కృష్ణుడి లంక అనే క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాను. హీరో పేరు కృష్ణ, అతను శ్రీలంకలో ఉంటాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అతని సమస్య ఏంటి? అనేది కథ. ఇంకా హీరో ఎవరు అనేది అనుకోలేదు. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను.

>
మరిన్ని వార్తలు