సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురు

5 Jul, 2015 02:46 IST|Sakshi

ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో చదివాడు. 2001లో పదవ తరగతి పరీక్షలో 468 మార్కులు సాధించాడు. తర్వాత విజయవాడలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో (ఎంపీసీ) ఇంటర్ చదివి 921 మార్కులు పొందాడు.   నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 77 శాతం మార్కులతో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం చెన్నైలోని సీటీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివాడు.
 
 దిల్లీలోని వాజీరామ్ అండ్ రవి కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు. మూడేళ్లుగా వరుసగా సివిల్స్పరీక్షలు రాస్తున్నాడు. సోషియాలజి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువడిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్ష ఫలితాలలో ఆలిండియాలో 85వ ర్యాంక్ సాధించాడు. శనివారం వెలువడిన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో 462వ ర్యాంక్ సాధించాడు.
 
 ఈ ర్యాంక్ ఆధారంగా ఈయనకు ఐపీఎస్, ఐఆర్‌ఎస్, కస్టమ్స్ ఆఫీసర్‌లలో ఏదో ఒక పోస్టు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయభాస్కర్‌రెడ్డి తల్లిదండ్రులు పెద్ద సుబ్బారెడ్డి, వెంకటమ్మలు మైలవరం మండలంలోని బాక్రాపేట గ్రామానికి చెందిన వారు. వీరిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అయితే మైలవరం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గ్రామం ముంపునకు గురికావడంతో ప్రొద్దుటూరుకు వచ్చి స్థిరపడ్డారు. తర్వాత కాలంలో పెద్ద సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. సివిల్ ర్యాంకర్ విజయభాస్కర్‌రెడ్డికి విజయలక్ష్మిదేవి, ప్రమీల దేవి, శశిరేఖ అనే అక్కచెల్లెల్లు ఉన్నారు, వారికి వివాహం అయింది.   
 
 వైద్య వృత్తి నుంచి సివిల్స్‌లోకి..
 వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రూకావాండ్లపల్లెకు చెందిన డాక్టర్ ఏ.సురేష్‌రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో 525వ ర్యాంకు సాధించారు.  రైతు కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, ధర్మాదేవిల కుమారుడు. ప్రస్తుతం వీరు రాయచోటిలోని ఎన్‌జీఓ కాలనీలో ఉంటున్నారు.
 ఈయన విద్యాభ్యాసం ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు శ్రీనికేతన్(రాయచోటి), ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకు (ఆంగ్లో ఇండియన్, రాయచోటి), తొమ్మిదవ తరగతి(రాజు స్కూల్), పది నుంచి ఇంటర్ వరకు(రత్నం కళాశాల, నెల్లూరు), ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు.
 
 రెండు సంవత్సరాలుగా రోయచోటిలో బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇతను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం పట్ల తన సొంత గ్రామమైన నూకావాండ్లపల్లెలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యువత ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. ఆ లక్ష్యం సాధనకు సమయం కేటాయించుకుని పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా చదివితే లక్ష్యం చేరడం కష్టం కాదని చెప్పారు.
 
 ఐఏఎస్ కోసం మరోసారి ప్రయత్నిస్తా : డా.ధీరజ్
 నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బి.ధీరజ్‌కుమార్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1177వ ర్యాంకు సాధించారు. ధీరజ్‌కుమార్ తండ్రి బి.జయభాస్కర్‌రావ్ వృత్తి రీత్యా రైల్వేలో వైద్యుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు. ప్రస్తుతం ఈయన గుంటకల్ రైల్వే డివిజన్‌లో అసిస్టెంట్ చీప్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ధీరజ్ తల్లి ఎం.విజయభారతి రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ డి.ఎమ్.డబ్లు.ఒ.గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పట్టుదలతో ప్రయత్నించి సివిల్స్‌లో విజయం సాధించారు. ఇతని సోదరుడు దీపక్‌కుమార్, సోదరి దీప్తిలు సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
 
 నందలూరులోని శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్‌లో పదవ తరగతి, నెల్లూరులోని రత్నం కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. సివిల్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ ఫలితం పట్ల తాను పెద్దగా సంతృప్తి పడటం లేదన్నారు. ఈ ర్యాంక్‌తో ఐఆర్‌ఎస్ రావచ్చని, తన లక్ష్యం ఐఏఎస్ అని చెప్పారు. ఆ లక్ష్యం కోసం మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహకం అధికంగా ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు