సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

16 Dec, 2019 11:14 IST|Sakshi

శ్రీవారి ఆలయంలో 17 నుంచి నివేదన

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైందిగా భావించే ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభం కానుంది. ఆరోజు అర్ధరాత్రి 11.47 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17 నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్‌ (గోదాదేవి) ఒకరు. శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.

ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఓ భాగం. నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. సాధారణంగా భోగశ్రీనివాస మూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. తిరుప్పావై పఠనం ఏకాంతంగా జరుగుతుంది. కాగా, ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరచి ఉంచుతారు. 

మరిన్ని వార్తలు