రాష్ర్టంలో వైఎస్సార్ సీపీదే హవా : సామినేని

10 Dec, 2013 01:45 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతుందని  పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం పెనమలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఉదయభాను మాట్లాడుతూ కాంగ్రెస్. టీడీపీ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అధికారపార్టీగా  కాంగ్రెస్, ప్రతిపక్షంగా టీడీపీ ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు.

రాష్ట్రంలో పటిష్టమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అది కేవలం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యపడుతుందని విశ్వసిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు విధానాలతో ఆ పార్టీ నాయకులు విసుగుచెందారని చెప్పారు.  సోనియాగాంధీ పుట్టిన రోజున నియోజకవర్గంలో మంచి పట్టు కలిగి ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ పార్టీలో చేరడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఖాళీ అయ్యే విధంగా వలసలుంటాయని చెప్పారు.   పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి గ్రామంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ సర్పంచి ఐనంపూడి చంద్రశేఖర్, పెనమలూరు మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు చిరుమామిళ్ల వెంకట రాజామౌళీశ్వరప్రసాద్, జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఐ.వెంకటేశ్వరరావు, పంచాయతీ మాజీ ఉప సర్పంచి వీర్ల వెంకటేశ్వరరావు, వణుకూరుకు చెందిన కాకాని రంగారావు, తెలుగుదేశం పార్టీకి చెందిన తోటకూర ప్రతాప్, కుప్పాల ప్రతాప్, కర్లపూడి దేవేంద్రబాబు, కొంకల శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం పార్టీలో చేరారు.

వీరందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు విఫలమయ్యారన్నారు. ఆయా పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేస్తుందని చెప్పారు. వైఎస్సార్ సీపీని బలోపేతం చేయటానికి తామంతా కృషి చేస్తామన్నారు. ఆఫీస్ కో-ఆర్డినేటర్ టి.ఆర్.అశోక్‌కుమార్, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సూరపనేని వెంకట రామారావు, ప్రభల శ్రీనివాస్, ఎం.ఎస్.నారాయణ, నారుమంచి నారాయణ, మాంతి రమణ తదితరులు పాల్గొన్నారు.
 
 నేటి నుంచి సమైక్య పోరు
 సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాంక్షిస్తూ ఎన్నో ఉద్యమాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మళ్లీ  ఉద్యమ బాటకు సిద్ధమయ్యిందని  సామినేని  అన్నారు. అక్టోబరు నెలలో గాంధీజయంతి నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి విదితమేనన్నారు. సమైక్య ఉద్యమంలో భాగంగా మంగళవారం నుంచి వరుసగా మూడు రోజులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. 10వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో ర్యాలీ. 11న ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ, 12న రహదారుల దిగ్బంధనం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. అదే విధంగా 14వ తేదీనుంచి ఒక్కో నియోజకవర్గంలో ఒక రోజున భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.  
 

>
మరిన్ని వార్తలు