రైతుకు అండగా... నేడు, రేపు నిరసనలు

25 Jul, 2014 04:02 IST|Sakshi
రైతుకు అండగా... నేడు, రేపు నిరసనలు

► వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సమాయత్తం
►షరతలు లేని రుణ మాఫీ చేయాలంటూ అన్ని మండలాల్లో ఆందోళనలు
► సీఎం చంద్రబాబు మోసంపై భగ్గుమంటున్న సీమాంధ్ర ప్రజలు
►విలేకరులతో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని
ఒంగోలు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయిన రైతులకు అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. షరతులు లేని రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలన్న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో శుక్ర,శనివారాల్లో రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేయనున్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు.

పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి ప్రజలు నిలువునా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏరు దాటాకా తెప్ప తగలేసిన చందంగా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు రైతులు, డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చి.. ఇప్పుడు షరతులతో కూడిన రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం మోసం కాదా.. అని ప్రశ్నించారు. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని బాలాజీ స్పష్టం చేశారు.

రుణాలు బేషరతుగా మాఫీ చేయాలి: ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఎటువంటి షరతులు లేకుండా చంద్రబాబు బేషరతుగా అమలు చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రైతులకు కేవలం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు, డ్వాక్రా గ్రూపుకు లక్ష రూపాయలు చొప్పున రుణ మాఫీ చేస్తామని ప్రకటించి ఏదో సాధించినట్లు టీడీపీ నేతలు చంకలు గుద్దుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం రోజే రుణమాఫీపై కమిటీ వేసి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఆందోళనల్లో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్యే సురేష్ పిలుపునిచ్చారు.   
 
అవి బూటకపు హామీలు
చంద్రబాబువి బూటకపు హామీలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా క న్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తొలి సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బూటకపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులను పట్టించుకోవడం లేదని సుబ్బారెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు