ఏసీబీ వలలో ట్రాన్స్‌కో లైన్‌మన్‌

4 Dec, 2018 12:27 IST|Sakshi
ఏసీబీ అధికారులకు చిక్కిన అసిస్టెంట్‌ లైన్‌మన్‌ వెంకట్రామయ్య

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం డబ్బు డిమాండ్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

చిత్తూరు, మదనపల్లె అర్బన్‌ : మదనపల్లెలో సోమవారం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ లైన్‌మన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీలు దీపికా పాటిల్, తిరుమలేశ్వర్‌రెడ్డి కథనం మేరకు.. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీకి చెందిన రైతు ఈశ్వర్‌ రెడ్డికి కోళ్లబైలులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసుకునేందుకు అప్పులు చేసి బోరు వేయించాడు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజుల క్రితం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరైంది. కనెక్షన్‌ ఇచ్చేందుకు అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ వెంకట్రామయ్య రూ.6 వేలు లంచం అడిగాడు.

బోరు వేసేందుకు తన వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చయిపోయిందని చెప్పినా అతను వినలేదు. డబ్బు ఇవ్వకపోతే కనెక్షన్‌ ఇవ్వడం కుదరదని అసిస్టెంట్‌ లైన్‌మన్‌ వెంకట్రామయ్య తేల్చిచెప్పాడు. దీంతో విసిగిపోయిన రైతు ఈశ్వర్‌రెడ్డి న్యాయం చేయాలంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రైతు లైన్‌మన్‌ వెంకట్రామయ్యకు ఫోన్‌ చేసి రూ.5 వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు తీసుకునేందుకు రావాలని కోరాడు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సీటీఎం రోడ్డులోని డివిజనల్‌ కార్యాలయం ఎదుట రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడు లైన్‌మన్‌ను అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు అడిషనల్‌ ఎస్పీలు దీపికా పాటిల్, తిరుమలేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి ప్రజలు 9440446190 కు ఫోన్‌ చేసి తెలిపితే సత్వరమే చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు