ఐఏఎస్‌ల బదిలీ

7 Feb, 2019 03:27 IST|Sakshi

ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీనర్సింహం చేనేతజౌళి శాఖకు బదిలీ

లిక్కర్‌ లాబీ, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కారు

ఎన్నికల ముందు మద్యాన్ని ఏరులై పారించడం, ఇష్టానుసారంగా విక్రయించడమే లక్ష్యం!

సాక్షి, అమరావతి: అక్రమ మద్యం విక్రయాల నియంత్రణంతోపాటు నిర్ణీత ధర కన్నా అధికంగా విక్రయించకుండా అడ్డుపడుతున్న ఎక్సైజ్‌ కమిషనర్‌ పి.లక్ష్మీనర్సింహంపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో ఇద్దరు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

లిక్కర్‌ లాబీ ఒత్తిళ్లతోనే...
ఎన్నికల ముందు మద్యం ఏరులై పారకుండా, ఇష్టానుసారంగా విక్రయించకుండా అడ్డుపడుతున్న లక్ష్మీనర్సింహంను ఆ పదవి నుంచి తప్పించాలని అధికార పార్టీ నేతలతో పాటు లిక్కర్‌ లాబీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తోంది. అయితే ఆయన ఒక్కరినే బదిలీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని గ్రహించి ఇప్పుడు మిగతా ఐఏఎస్‌లతోపాటు ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీనర్సింహంను కూడా బదిలీ చేశారు. పి.లక్ష్మీనర్సింహంను తాజాగా చేనేత– జౌళి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పర్యాటక, యువజన సర్వీసుల కార్యదర్శిగా ఉన్న ముఖేశ్‌కుమార్‌ మీనాను ఎక్సైజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పర్యాటక, యువజన సర్వీసుల బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

శ్రీకాకుళం, కృష్ణా కలెక్టర్ల బదిలీ..
శ్రీకాకుళం, కృష్ణా జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత–జౌళి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్‌ను గనులశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. శ్రీనివాస శ్రీ నరేశ్‌కు గనుల శాఖ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ను పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డిని పర్యాటక అధారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎం.రామారావును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి, భాస్కర్‌ను సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.విజయను సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్రితికా శుక్లాను కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పర్యాటక శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్న హిమాన్షు శుక్లాను గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు.  

ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు రేంజ్‌ ఐజీపీగా పనిచేస్తున్న కె.వి.వి.గోపాలరావును ఏపీఎస్‌పీ బెటాలియన్‌ ఐజీపీగా బదిలీ చేశారు. ఏపీఎస్‌పీ బెటాలియన్‌ ఐజీపీ రాజీవ్‌ కుమార్‌ మీనాను గుంటూరు రేంజ్‌ ఐజీపీగా బదిలీ చేశారు. విజయవాడ సిటీ డీసీపీగా పనిచేస్తున్న గజరావు భూపాల్‌ను మంగళగిరిలోని ఏపీఎస్‌పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా బదిలీ చేశారు.   

మరిన్ని వార్తలు