పని నుంచి బడికి.. 

25 Dec, 2023 05:04 IST|Sakshi

విద్యార్థులుగా మారుతున్న బాల కార్మికులు  

1506 మందికి వెట్టి నుంచి స్వేచ్ఛ 

రాష్ట్రానికి చెందిన 897 మందిని బడిలోకి చేర్చిన సీఐడీ 

సత్ఫలితాలనిస్తున్న ఆపరేషన్‌ స్వేచ్ఛ 

రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు. ‘ఆపరేషన్‌ స్వేచ్ఛ’ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకువస్తోంది.  

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నాని.. ఏడో తరగతి తర్వాత చదువు మానేశాడు. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ బైక్‌ మెకానిక్‌ షాపులో పనికి చేరాడు. రెండేళ్ల పాటు ఆ షాపులోనే సహాయకుడిగా పనిచేశాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు ‘ఆపరేషన్‌ స్వేచ్ఛ’ పేరిట అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సీఐడీ అధికారులు.. నానిని చూశారు.

అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను వివరించారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని వారికి అవగాహన కల్పించారు. నానిని అదే బడిలో 8వ తరగతిలో చేర్చించారు. ప్రస్తుతం నాని తోటి పిల్లలతో కలిసి చక్కగా చదువుకుంటున్నాడు. ఇక తాను పనికి వెళ్లనని, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు.

బాల కార్మికుల నుంచి మళ్లీ విద్యార్థులుగా.. 
సామాజికబాధ్యత కింద బాల కార్మిక వ్యవస్థ నిర్మూల కోసం సీఐడీ చేపట్టిన ‘ఆపరేషన్‌ స్వేచ్ఛ’ సాధించిన విజయమిది.  ఇలా ఒక్క నాని మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులుగా మగ్గుతున్న అనేక మంది పిల్లలను సీఐడీ అధికారులు గుర్తించి వారిని మళ్లీ బడిలో చేర్పిస్తున్నారు.

బాల కార్మికులుగా కష్టాల కడలిలో ఈదుతున్న వారిని సీఐడీ అధికారులు గుర్తించి సురక్షితంగా చదువుల తల్లి ఒడిలోకి చేర్చారు. ఆపరేషన్‌ స్వేచ్ఛ కార్యక్రమం బాల కార్మికుల జీవితాల్లో మళ్లీ విద్యా వెలుగులు తీసుకొస్తోంది. ఆపరేషన్‌ స్వేచ్ఛ కార్యక్రమాన్ని సీఐడీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం 26 జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఐడీ అధికారులతో పాటు మహిళా–శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీలు, వివిధ సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది.

ఈ ఏడాది మొత్తం నాలుగు దశల్లో 66 రోజుల పాటు ఆపరేషన్‌ స్వేచ్ఛ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి బాల కార్మికులను గుర్తించింది. ప్రధానంగా బాల కార్మికులను ఎక్కువుగా పనిలో పెట్టుకునే ఇటుక బట్టీల తయారీ, హోటళ్లు, వివిధ పారిశ్రామిక యూనిట్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్‌ షెడ్లు, ఇతర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.

ఆపరేషన్‌ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మొత్తం 1,506 మంది బాల కార్మికులను గుర్తించింది. వారిలో బాలురు 1,299 మంది ఉండగా.. బాలికలు 207 మంది ఉన్నారు. మొత్తం బాల కార్మికుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 609 మందిని వారి సొంత రాష్ట్రాలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. మన రాష్ట్రానికి చెందిన 897 మంది బాల కార్మికుల తల్లిదండ్రులతో చర్చించి వారికి అవగాహన కల్పించి.. ఆ పిల్లలను మళ్లీ బడుల్లో చేర్పించింది.

బాల కార్మికులుగా మారడానికి కారణాలు
తల్లిదండ్రులు లేకపోవడం:36 మంది
పరీక్షల్లో ఫెయిల్‌ కావడం29 మంది
పేదరికం: 984 మంది

ఇతర కారణాలు:457 మంది

మళ్లీ బడిలో చేరిన బాల కార్మికులు సామాజికవర్గాలవారీగా..
ఎస్సీ259 మంది
ఎస్టీ131 మంది
బీసీ719 మంది
మైనార్టీ190 మంది
ఓసీ 207 మంది

మళ్లీ బడిలో చేర్పించే నాటికి బాల కార్మికులుగా పనిచేస్తున్నవారు..
ఇటుక బట్టీల్లో 138 మంది
హోటళ్లలో 117 మంది
పారిశ్రామిక యూనిట్లలో 143 మంది
ఇతర చోట్ల 1108 మంది

బాల కార్మికులుగా చేరేనాటికి వారి చదువులు ఇలా..
నిరక్ష్యరాస్యులు264 మంది
అయిదో తరగతిలోపు 270 మంది
అయిదు నుంచి పదో తరగతి 792 మంది
చెప్పలేనివారు 180 మంది 

సామాజిక, ఆర్థిక దృక్కోణంలో విశ్లేషణ..
బాల కార్మికులను గుర్తించి కేవలం మళ్లీ బడుల్లో చేర్చడమే కాదు.. ఈ సమస్య మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం దిశగా సీఐడీ కార్యాచరణ చేపట్టింది. అందుకోసం బాల కార్మికుల సామాజిక, ఆర్థిక అంశాలపైనా విస్తృతంగా అధ్యయనం చేస్తోంది. తద్వారా బాల కార్మిక వ్యవస్థను సమూలంగా పెకలించి వేసి బడి ఈడు పిల్లలు అందరూ కచ్చితంగా బడుల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించిన బాలల వివరాలిలా ఉన్నాయి..

సమన్వయంతో సత్ఫలితాలు  
బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని విద్య, మహిళా–శిశు సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని ఆయా రాష్ట్రాలకు సురక్షితంగా చేరుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన బాల కార్మికుల అవగాహనను పరీక్షించి తదనుగుణంగా తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. మళ్లీ వారు పనిలోకి వెళ్లకుండా.. శ్రద్ధగా చదువుకునే వ్యవస్థను కల్పిస్తున్నాం. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ

సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తున్న సీఐడీ 
సీఐడీ విభాగం అంటే కేవలం కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ మాత్రమే కాదు. సీఐడీకి అంతకుమించి విస్తృత పరిధి ఉంది. అందులో ప్రధానమైనది సామాజిక బాధ్యత. అందుకే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ స్వేచ్ఛ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. సీఐడీలో ప్రత్యేకంగా సామాజిక విభాగం కింద ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతాం.  – సంజయ్, సీఐడీ అదనపు డీజీ

>
మరిన్ని వార్తలు