రెవెన్యూ శాఖలో బదిలీలు

31 Oct, 2013 04:33 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెవెన్యూ విభాగంలో బదిలీల వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడింది. ఊహించిన ట్లే భారీ సంఖ్యలో తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. ఒత్తిళ్లు వస్తాయని ముందే పసిగట్టిన అధికారులు బదిలీల ఉత్తర్వులను తహసీల్దార్ల చేతిలో పెట్టే వరకూ విషయం బయటకు పొక్కకుండా గోప్యం పాటించారు. మూడు రోజులపాటు కసరత్తు చేసినప్పటికీ ఒకటి, రెండు పోస్టింగ్‌ల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదని రెవెన్యూ ఉద్యోగుల ద్వారా తెలిసింది. బదిలీ అయిన 26 మందిలో 19 మంది తహసీల్దార్లు ఉండగా.... ఏడుగురు డిప్యూటీ తహసీల్దారు ఉన్నారు. అయితే పని ఒత్తిళ్ల దృష్ట్యా ఏడుగురు డీటీల్లో ఆరుగురికి అఫీషియేటింగ్‌పై తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేశారు. ఒక డీటీకి అదే హోదాపై స్థానచలనం గావించారు.
 
 ఉదయం 7 గంటల నుంచే ఫోన్ కాల్స్
 బదిలీల ప్రక్రియకు సంబంధించిన తతంగాన్ని మంగళవారం రాత్రి ముగించిన అధికారులు... స్థానచలనం పొందిన అధికారులకు బుధవారం ఉదయం డీఆర్‌ఓ సీసీ ద్వారా సమాచారం ఇచ్చారు. సుమారు 7 గంటల నుంచి అందరికీ ఫోన్ కాల్స్ ప్రారంభమయ్యాయి. ‘సార్.. డ్రాట్, ఎలక్షన్స్‌పై కలెక్టర్ ఆర్డ్‌ర్స్ ఇచ్చారు... ఉదయం 9.30 గంటలకు డీఆర్‌ఓ కార్యాలయంలో విధిగా తీసుకోవాలి’ అని వర్తమానం అందింది. ఈ మేరకు ఒక్కొక్కరు వచ్చేసరికే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసి అందించారు. ఉత్తర్వులు అందుకునే వరకూ అసలు విషయం తెలియకపోవడంతో కొందరు తహసీల్దార్లు ఓకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
 కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు
 బదిలీల విషయంలో తమ అభ్యర్థనలు పరిశీలించాలని కోరుతూ జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు పరిటాల సుబ్బారావు, రాజేష్‌కుమార్, కుమారస్వామి తదితరులు కలెక్టర్‌ను కలిశారు. సంఘం ప్రతినిధులుగా ఉన్నవారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వారి విజ్ఞప్తిని కలెక్టర్ పరిగణనలోకి తీసుకుంటే... తుది జాబితాలో ఒకటి, రెండు మార్పులు జరిగే అవకాశముంది.
 
 త్వరలో డీటీల బదిలీలు ?
 ప్రస్తుతం భారీ సంఖ్యలో తహసీల్దార్లను బదిలీ చేసిన యంత్రాంగం... త్వరలో డిప్యూటీ తహసీల్దార్లకు స్థానచలనం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అఫీషియేటింగ్ వల్ల ఖాళీ అయిన స్థానాలను సర్దుబాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా అధికారుల వద్ద నెలల కాలంగా పెండిగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు