‘ఏపీలో కులగణనతో ఒక చరిత్ర ప్రారంభం కానుంది’

20 Nov, 2023 12:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో కుల గణన -2023పై ప్రాంతీయ సదస్సు  విజయవాడలో జరుగుతోంది. ఈ సదస్సుకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ముస్తఫా, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, కె.లక్ష్మణరావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు హాజరయ్యారు. 

ఈ సందర్బంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ..‘ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశమంతా సీఎం జగన్‌ ఆలోచనలను ఫాలో అవుతోంది. గతంలో మంజునాథన్ కమిషన్ ఫెయిలైంది. అందుకే సీఎం జగన్‌ శాశ్వత బీసీ కమిషన్‌ను వేశారు. బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.  
సామాజిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అన్ని సామాజిక వర్గాలపై సీఎం జగన్‌కు ఎంతో గౌరవం ఉంది. గతంలో ఉద్యమాలు చేసినా కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదు’ అన్నారు.

ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘ఏపీలో కులగణనతో ఒక చరిత్ర మొదలవ్వబోతోంది. బీసీలు ఏకమైతే రాజకీయంగా బలవంతులవుతారని 70 ఏళ్లుగా మనల్ని ఎదగనివ్వలేదు. సీఎం జగన్‌ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు మనకు రిజర్వేషన్లు కల్పించిన కారణజన్ముడు అంబేద్కర్.  ఈనాడు కులగణనకు శ్రీకారం చుట్టి సీఎం జగన్‌ కారణజన్ముడయ్యాడు. ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయాల కోసం కులగణన చేయడం లేదు. కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. 
ఏపీలో జరగబోయే కులగణన దేశానికే ఒక నిర్ధేశం అవుతుంది’.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. కులగణన చేయాలని సీఎం జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు ధన్యవాదాలు. అన్ని కులాలకు మేలు జరగాలని 90 ఏళ్ల తర్వాత సీఎం జగన్‌ ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. మన దేశంలో కులం అనేది ఒక కల్చరల్ ఈవెంట్ వంటిది. కులగణన జరిపే క్రమంలో పకడ్భంధీగా వ్యవహరించాలని కోరుతున్నాను. 
 
ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ..‘బీసీ కులగణన చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కులగణనకు చట్టబద్ధత ఉండాలి. సచివాలయ సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను జతచేసి చేయాలి. కోర్టు సమస్యలు రాకుండా ఉండాలంటే వాలంటీర్లను కులగణనలో భాగస్వామ్యులను చేయొద్దని కోరుతున్నాను. రాష్ట్రంలోని నాలుగు కమిషన్లను భాగస్వామ్యులను చేయాలి. వలస కార్మికులు, సంచార జాతులపై ప్రత్యేక దృష్టి సారించాలి. కులగణన జరిగిన తర్వాత సచివాలయాల వద్ద లిస్టులు ప్రదర్శించాలి. కులగణన జరిగే పది రోజుల్లో ఒక రోజు సెలవు ప్రకటించి ఆరోజు అందరి వివరాలు తీసుకోవాలి. ఈకేవైసీకి కులగణనకు ముడి పెట్టవద్దని కోరుతున్నా.  కులగణన విజయవంతం కావాలని కోరుతున్నాను’. 

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ..‘కులగణన జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. కులగణనను సీఎం జగన్‌ రాజకీయం కోసం చేయడం లేదు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందేవారికి కులగణనతో చెక్ పడుతుంది. సీఎం జగన్‌ చొరవతో 90 ఏళ్ల తర్వాత కులగణన జరగబోతోంది. కులగణన విజయవంతం కావాలని కోరుతున్నాను’. 

మరిన్ని వార్తలు