వాగు మధ్యలో చిక్కుకొన్న దంపతులు

15 Oct, 2019 13:24 IST|Sakshi
రాజుబాబు, దేవమ్మ చిక్కుకొన్నది ఈ వాగులోనే ,గిరిజన దంపతులు రాజుబాబు, దేవమ్మ

గ్రామస్తుల చొరవతో క్షేమంగా ఇంటికి చేరిన బాధితులు

రాజవొమ్మంగి (రంపచోడవరం): రోజూ మాదిరిగానే పొలం నుంచి వాగు దాటి ఇంటికి వస్తున్న రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామానికి చెందిన ముర్రం రాజబాబు, దేవమ్మలు అనుకోని రీతిలో వాగు మధ్యలో చిక్కుకొన్నారు. వారు ఇరువురు వాగు మధ్యలో గల ఓ చెట్టు ఆసరా చేసుకొని వాగు ఉధృతి తగ్గే వరకు దాదాపు రెండు గంటల పాటు ఆ చెట్టుపైనే వేచి ఉండి చివరికి గ్రామానికి చెందిన యువకుల సహాయంతో క్షేమంగా ఇంటికి చేరారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షుల కథనమిది.. రాజబాబు, దేవమ్మలు పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తు రోజు మాదిరిగానే తమ గ్రామానికి సమీపాన గల మడేరు వాగు దాటసాగారు. అప్పటికే అదే గ్రామానికి చెందిన కొంత మంది వాగుదాటి అవలివైపు చేరుకోగా రాజబాబు, దేవమ్మలు కూడా వాగు దిగారు.

అయితే వారు వాగు మధ్యలోకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఉప్పొంగడం గమనించిన దేవమ్మ వాగుమధ్యలో గల చెట్టు పట్టుకొని వాగు ఉధృతి తగ్గే వరకు ఆగుదామని భర్తను కోరింది. దీంతో ఆ చెట్టుపైనే వారిద్దరూ కాసేపు వుండిపోయారు. ఇది తెలుసుకొన్న స్థానిక యువకులు ఈకా నాగరాజు, నయిన రమేష్, పూసం పండుదొర, ముర్రం మల్లుదొరలు హుటాహుటిన వాగు వద్దకు వెళ్లి రాజుబాబు, దేవమ్మలకు తాళ్లు అందజేశారు. వారిని సురక్షితంగా వాగు దాటించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. సంఘటన స్థలానికి స్థానిక సీఐ నాగదుర్గారావు, ఎస్సై వినోద్‌ వచ్చి ఆరా తీసి ఎవరికి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకొని వెనుదిరిగారు. స్థానికంగా వర్షాలు కురవకపోయినా ఎగువన కురిసే వానలకు ఈ వాగు ఉన్నట్టుండి పొంగుతోంని, ఇది తమకు అలవాటైపోయిందని స్థానికులు అంటున్నారు. గ్రామసమీపాన గల ఈ వాగుపై తాళ్ల వంతెన నిర్మించి తమ ఇబ్బందులు తొలగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా వాగు మధ్యలో చిక్కుకొన్న ముర్రం రాజుబాబు లాగరాయి పీహెచ్‌సీలో ఎంపీహెచ్‌ఏగా పనిచేస్తున్నాడు.

మరిన్ని వార్తలు