ఉట్టిపడిన తెలుగుదనం

22 Mar, 2015 01:43 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నవ్యాంధ్ర రాజధానిలో తెలుగు సంస్కృతి తొణికిసలాడింది. కళారూపాల్లో సంప్రదాయం ఉట్టిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ పంచాంగ శ్రవణం చేయగా, వ్యవసాయ, ఉద్వానవన పంచాంగాల ఆవిష్కరణ జరిగింది.

కూచిపూడి విశిష్టతను తెలియపరిచే కూడిపూడి నాట్యారామం వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. తొలుత ముఖ్యమంత్రి అనంతవరం కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముగించి వేదిక వద్దకు 10.35 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఐవైఆర్ కృష్ణారావు అనంతరంలో ఉగాది వేడుకలు నిర్వహణలోని ఆవశ్యకతను వివరించారు. కృష్ణానదికి సమీపంలో ఏర్పాటు కానున్న నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు వలన నదికి ఇరువైపులా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని టీటీడీ పండితులు తంగిరాల పేర్కొన్నారు. వర్షపాతం తక్కువుగా ఉన్నప్పటికీ పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తుందని పేర్కొన్నారు.
 
వృవసాయం, క్షీర సంపద వృద్ధి..
అనంతరం వ్యవసాయ పంచాంగాన్ని గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకులు డీఎన్ దీక్షితులు చదవి వినిపించారు. రానున్న సంవత్సరంలో వ్యవసాయ అభివృద్ధి, క్షీరసంపద అధికంగా జరుగుతుందని తెలిపారు. ఆ తరువాత ఉద్యానవన పంచాంగం, కూచిపూడి విశిష్టతను తెలియపరిచే వెబ్‌సైట్, జర్నలిస్టుల డైరీల ఆవిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, సిద్దా రాఘవరావు, మాణిక్యాలరావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు.

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రులంతా కృతజ్ఞతులు తెలిపారు. ముఖ్యమంత్రిపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు అన్ని వేళలా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణం, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు, రైతులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను వివరించారు. రాజధాని శంకుస్థాపన, నిర్మాణ పనుల ప్రారంభం తదితర వివరాలను వెల్లడించారు.

పురస్కారాల ప్రదానం
ఈ సందర్భంగానే 32 మందికి కళారత్న(హంస), 67 మందికి ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రముఖ వాగ్గేయకారులు డాక్టర్ బాలాంత్రపు రజనీ కాంతారావుకు తెలుగు వెలుగు విశిష్ట పురస్కారాన్ని అందించి సత్కరించారు. పురస్కారంలో భాగంగా రూ. లక్ష నగదు, జ్ఞాపికను ప్రదానం చేశారు. హంస పురస్కార గ్రహీతలకు రూ. 50, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. విచ్చేసిన ఆహూతులకు ఉగాది పచ్చడి, ఆల్పాహారం, లస్పీ, మంచినీటి సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

ఉగాది వేడుకల ఆవరణ ప్రారంభంలో వెలవెల బోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించే ఆనవాయితీ ఉండటంతో పూజలు పూర్తయిన తరువాతగాని వేడుక వద్దకు ప్రజలు రాలేదు. సుమారు 50 వేల మందికి ఈ ఆవరణలో సౌకర్యాలు కల్పించినా, కార్యక్రమం ప్రారంభంలో ఐదారువేలకు మించి ప్రజలు లేరు.

దీనితో అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన ఆర్టీసీ బస్‌లను గ్రామాల్లోకి పంపి డ్వాక్రా గ్రూపు సభ్యులను కార్యక్రమానికి వచ్చే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఉగాది వేడుకల కార్యక్రమం వైభవంగానే పూర్తికావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, శాసన సభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌లు వేడుకల ఏర్పాట్లు పర్యవేక్షించారు.

>
మరిన్ని వార్తలు