మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు

12 Aug, 2019 18:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సమాజంలో నడిరోడ్డుపై దారుణమైన ఘటనలు జరుగుతున్నా ప్రజలు నిలువరించలేక పోతున్నారని రాష్ట్ర మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మణిక్రాంతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... సమాజంలో మగాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారన్నారు. గతంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో మణిక్రాంతి హత్య జరిగిందని పేర్కొన్నారు. ఘటన తీవ్రత చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగా హత్య చేశారని అర్థవుతుందన్నారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో మణిక్రాంతి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో కమిషనర్‌ను వివరణ కోరతామని స్పష్టం చేశారు. అదే విధంగా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఇక జిల్లాలోని సత్యనారాయణపురం శ్రీనగర్‌ కాలనీకి చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి తన భార్య మణిక్రాంతి తలనరికి పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మణిక్రాంతి భర్త ప్రదీప్‌పై పోలీసులకు దాదాపు 10సార్లు ఫిర్యాదు చేసింది. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో మణిక్రాంతిపై పగ పెంచుకున్న ప్రదీప్‌ ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికి కాలువలో పడేశాడు. అనంతరం పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. కాగా మణిక్రాంతి తల ఇంతవరకు దొరకలేదు. దీంతో తల లేకుండానే వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వేరే గత్యంతరం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మణిక్రాంతి మొండానికి అంత్యక్రియలు చేశారు. ఇక తల దొరకకపోతే కేసు క్లిష్టతరంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతుండగా.. పక్కా ప్రణాళికతో సాక్ష్యాలు సేకరించే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు