వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం

22 Jun, 2020 20:20 IST|Sakshi
వసుధ వాత్సల్య నిలయంలో భోజనాలు చేస్తున్న వృద్ధులు

వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న వసుధ వాత్సల్య నిలయం

6 ఎకరాల విస్తీర్ణంలో.. ప్రశాంత వాతావరణంలో నిర్వహణ

ఉచిత భోజనంతో పాటు వైద్య, ఆరోగ్య రక్షణకు ఏర్పాట్లు

కడుపున పుట్టిన బిడ్డలపై తల్లిదండ్రులకు చనిపోయేంత వరకూ వాత్సల్యం పోదు.. కానీ పిల్లలకు అలా కాదు.. నేటి తరానికి అయితే మరీనూ.. ఉద్యోగంలో బిజీ అనో.. ఎంతోదూరంలో ఉన్నామనో.. ఫ్యామిలీలో సమస్యలనో.. ఆర్థికంగా ఇబ్బందులనో.. తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.. అమ్మనాన్నలను అనాథలను చేస్తున్నారు.. కొందరైతే సంతానం లేక.. ఆదరించే వారు లేక ఒంటరిగా మిగులుతున్నారు.. అలా ఆదరణ కోల్పోయిన వృద్ధులను ఎంతో వాత్సల్యంతో అక్కున చేర్చుకుంటోంది పాలకోడేరు మండలం గరగపర్రులోని వసుధ వాత్సల్య నిలయం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సాక్షి, భీమవరం: ఉభయ తెలుగురాష్ట్రాల్లో డబ్బులు తీసుకుని వృద్ధులను ఆదరించేందుకు అనేక ఆశ్రమాలున్నాయి. ఇటువంటి ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న వసుధ ఫౌండేషన్‌ చైర్మన్‌ మంతెన రామలింగరాజు పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వసుధ వాత్సల్య నిలయం పేరుతో ఉచిత అనాథాశ్రమాన్ని ఏర్పాటుచేశారు. సంవత్సరాలు తరబడి ఎంతో శ్రద్ధతో దీనిని నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోని గరగపర్రు గ్రామంలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవంతులు నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రయం కల్పిస్తున్నారు.  

అనేక రాష్ట్రాల్లో..  
2002లో వసుధ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో 46 సేవా సంస్థలను ఏర్పాటు చేసి కుల,మత భేదాలకు తావులేకుండా ఎంతోమంది అభాగ్యులకు సేవలందిస్తున్న రామలింగరాజు స్వగ్రామం గరగపర్రు. అందుకే ఆయన స్వగ్రామంలోనూ వసుధ వాత్సల్య నిలయం ఏర్పాటు చేశా>రు. విశాలమైన ప్రదేశంలో పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తోన్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వృద్ధులు, 10 మంది విద్యార్థులూ ఉన్నారు. వీరికి ఉచిత భోజనం, వసతి, వైద్యం అందించడమేగాక విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. విద్యార్థుల్లో  కొంతమంది అంధ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరికీ వేళకు భోజనం పెట్టడమేగాక వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిత్యం వైద్యసేవలందే ఏర్పాటు చేశారు. వృద్ధుల్లో ఓపిక ఉన్నవారు మాత్రం కాలక్షేపం కోసం మొక్కలకు నీరు పోయడం వంటి చిన్నచిన్న పనులు చేస్తుంటారు.

నా అన్నవాళ్లు లేకనే..
నా భర్త నాగిరెడ్డి కౌలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలు కూడా చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను వసుధ వాత్సల్య నిలయం ఆదుకుంది. నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నా, కన్నబిడ్డల కంటే ఎక్కువగా ఏ కష్టం లేకుండా చూస్తున్నారు.
– కొవ్వూరి చెల్లాయమ్మ, పెంటపాడు

పనిచేసే ఓపిక లేక..  
నా వయస్సు 65 ఏళ్లు. కులవృత్తి చేనేతతో నాభర్త వీరాస్వామి కంటికి రెప్పలా నన్ను చూసుకునేవారు. సంతానం లేదు. ఆయన మరణంతో  కొంత కాలం ఇళ్లల్లో పాచి పనిచేసి జీవనం సాగించాను. పనిచేసే ఓపిక నశించి గ్రామస్తుల సలహాతో వాత్సల్య నిలయంలో చేరాను. ప్రస్తుతం ఇక్కడ సంతోషంగా గడుపుతున్నాను.  
– వింజమూరి విజయలక్ష్మి, ఉండి గ్రామం

ఏ లోటు లేకుండా ఆనందంగా..
భార్య, బిడ్డలు దూరం కావడంతో  80 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడపడం దుర్భరంగా మారింది. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తరుణంలో ఆత్రేయపురం వసుధ ఫౌండేషన్‌ కార్యకర్తలు వసుధ వాత్సల్య నిలయానికి పంపించారు. ఏ లోటు లేకుండా అందరితో  ఆనందంగా గడుపుతున్నా.
– వేగేశ్న సత్యనారాయణరాజు, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా

ఎంతో ఆదరణతో చూస్తున్నారు
నా వయస్సు ప్రస్తుతం 75 ఏళ్లు. నన్ను ఆదరించేవారెవరూ లేరు. పనిచేసే ఓపిక  లేదు. అగమ్యగోచరంగా జీవితం. ఇటువంటి తరుణంలో 4 సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చేరా. రామలింగరాజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంతో ఆదరణతో చూస్తున్నారు. భగవంతుని ధ్యానిస్తూ ఆనందంగా జీవిస్తున్నాను.  
– కలికి సుబ్బారావు, చిలకంపాడు

అనాథలను ఆదుకోవాలనే..
వసుధ ఫౌండేషన్‌ ద్వారా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నా.  సొంతంగా ఆశ్రమం నిర్వహించాలనే సంకల్పంతో 12 ఏళ్ల క్రితం 25 మందితో ఆశ్రమం ప్రారంభించి ప్రస్తుతం 40 మందితో నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఆదరణకు నోచుకోని వారిని ఆదరించాలనే సంకల్పంతోనే వృద్ధాశ్రమం ఏర్పాటుచేశాం.
– మంతెన రామలింగరాజు, వసుధ ఫౌండేషన్‌ చైర్మన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా