వెలగపూడి.. అదే వంకరబుద్ధి!

10 Jun, 2019 11:42 IST|Sakshi
అక్రమ నిర్మాణం జరుగుతున్న వెంకోజీపాలెం (ఎంవీపీ సెక్టార్‌–2)లోని భవనం

అక్రమ నిర్మాణాలకు మళ్లీ తెరతీసిన ఎమ్మెల్యే  

వెంకోజీపాలెంలో యథేచ్ఛగా పైఅంతస్తు నిర్మాణం

తన బినామీకి లబ్ధిచేకూర్చే యత్నం

పట్టించుకోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లినా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీరు మారలేదు. తన సహజ పద్ధతిలో మళ్లీ అడ్డగోలు దందాలకు తెరలేపారు. తన బినామీకి చెందిన భవనంపై అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా మరో అంతస్తు నిర్మిస్తున్నారు.  అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన జోన్‌–2, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పరోక్షంగా  సహకరిస్తున్నట్లు తెలిసింది.

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): టీడీపీ అధికారంలో ఉండగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు  అనేక విలువైన స్థలాలు అక్రమించడంతో పాటు పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం మరోసారి అక్రమాలకు తెర తీసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఎంవీపీకాలనీలోని వెంకోజిపాలెం బస్టాప్‌ వద్ద నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. దాదాపు 5 ఏళ్ల క్రితం జీ ప్లస్‌ 3గా ఇక్కడ ఒక భవన నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం కింది భాగంలో సెల్లార్‌ ఉండగా మొదటి ఫ్లోర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  నిర్వహిస్తున్నారు. ప్రధాన జంక్షన్‌లో ఈ భవనం ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా మరో ప్లోర్‌ నిర్మించి సొమ్ముచేసుకోవాలని వెలగపూడి బినామీగా వ్యవహరించే  చౌదరి అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు అక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన తూర్పు నియోజకవర్గంతో పాటు నగర వ్యాప్తంగా పలు అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్లు సమాచారం. పేద వారు చిన్న షెడ్డు వేసుకుంటే ఆగమేఘాలపై స్పందించే అధికారులు ప్రస్తుతం ఎందుకు స్పందించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిసెంబర్‌కు ముందు చూపించుకోడానికే..
డిసెంబర్‌ 2018 తరువాత ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని తక్షణమే రద్దు చేయాలంటూ ఇటీవల ప్రభుత్వ జీవో విడుదల చేసింది. దీంతో డిసెంబర్‌ తరువాత సాగిన నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం డిసెంబర్‌ తరువాత నిర్మాణాలను రద్దు చేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో అంతకుముందే ఇక్కడ నిర్మాణం జరిగినట్లు చూపించి లబ్ధిపొందాలని ఎమ్మెల్యే బినామీ  చూస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే   రెండు రోజుల నుంచి 50 మందికి పైగా కూలీలతో  ఆగమేఘాలపై ఈ పనులు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో   పనులు పూర్తిచేసి డిసెంబర్‌కు ముందే ఈ పనులు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేయించాలన్నది వారి ఆలోచన. దీంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వెలగపూడి అనుచరులు ఇదే పంథా అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన జోన్‌–2 ఉన్నతాధికారులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పరోక్షంగా ఎమ్మెల్యేకు సహకరిస్తున్నట్లు   పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నారు.  దీనిపై జీవీఎంసీ జోన్‌–2 కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు వివరణ కోరేందుకు  ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు