విజయవాడే నన్ను పరిపూర్ణ జర్నలిస్టుగా మలిచింది

20 Dec, 2014 01:45 IST|Sakshi
విజయవాడే నన్ను పరిపూర్ణ జర్నలిస్టుగా మలిచింది
  • వార్తారచన ఐదో ముద్రణ ఆవిష్కరణ సభలో కె.రామచంద్రమూర్తి
  • సాక్షి, విజయవాడ: ‘బెంగళూరులో నా జర్నలిస్ట్ జీవితం ప్రారంభమైంది. తర్వాత విజయవాడలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్, ఢిల్లీలో పనిచేశాను. నాలుగు దశాబ్దాల నా జర్నలిస్ట్ జీవిత ప్రయాణంలో నన్ను పరిపూర్ణ జర్నలిస్టుగా మలిచింది విజయవాడే..’ అని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న తాను చాలా అదృష్టవంతుడినన్నారు.

    జర్నలిజంలో సి.రాఘవాచారి తనకు ఆదర్శమని, అలాగే పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, ఉషశ్రీతో ఐదేళ్ల సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అనేకమంది కమ్యూనిస్టు పెద్దలతో కలిసి మాట్లాడిన అవకాశం కూడా విజయవాడలో ఉన్నప్పుడే కలిగిందని, అందుకే తాను ఎప్పటికీ విజయవాడను ప్రేమిస్తుంటానని తెలిపారు. కె.రామచంద్రమూర్తి రచించిన వార్తారచన పుస్తకం ఐదో ముద్రణ ఆవిష్కరణ సభ, ‘పత్రికలు-ప్రజాస్వామ్యం’ అంశంపై సదస్సు శుక్రవారం విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగాయి.

    మాకినేని బసవపున్నయ్య శతజయంతి సదస్సులో భాగంగా రెండో సదస్సుగా దీన్ని నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఉపసంపాదకురాలు వడ్లమూడి పద్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ తాను నిజంగా అదృష్టవంతుడినని, అనేక పత్రికల్లో ఎడిటర్, వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం దక్కిందన్నారు. 21 ఏళ్ల కిందట ప్రెస్‌క్లబ్‌లో పుస్తకావిష్కణ జరిగిందని, దాన్ని నండూరి రామమోహనరావు ఆవిష్కరించారన్నారు.
     

మరిన్ని వార్తలు