ఎమ్మెల్యేను దూషించిన వారిని అరెస్ట్ చేయాలి

4 Sep, 2019 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తాడికొండ ఎమ్మెల్యే,దళిత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవిని వినాయక చవితి వేడుకల సందర్భంగా ఘోరంగా అవమానించిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని దళిత నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం దళిత సంఘాల నేతలు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళ్ళం భాగ్యరావు మాట్లాడుతూ.. ఏపీ రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేపై అగ్రవర్ణ కుల అహంకారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది కుల వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. 40 శాతం దళితులు ఉన్న రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేకే రక్షణ కరువైందని.. ఇక అక్కడ ఉండే దళిత సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీ నేతలకు రక్షణ ఎక్కడుంది అని ఎద్దేవా చేశారు.

ఒక మహిళా ఎమ్మెల్యే, దళిత నాయకులు, డాక్టరైన ఆమెను గౌరవించకుండా కులం పేరుతో దూషించడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యపై సీఎం జగన్‌మోహన్రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలని అన్నారు. దళితులపై ఎటువంటి వివక్ష చూపని ఎట్రాసిటీ ప్రో గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్బంగా భాగ్యరావు కోరారు. గతంలో టీడీపీ నాయకులు, సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిని అవమానించారని గుర్తు చేశారు. భవిష్యత్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

కులవివక్ష వ్యతిరేక ప్రచార సంఘం అధ్యక్షులు పరిశపోగు రాజేష్ మాట్లాడుతూ.. దళిత మహిళ, శాసన సభ్యురాలైన శ్రీదేవిపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. కులం పేరుతో దూషించి, ఉన్మాదం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే అన్ని దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 

మైనార్టీ నాయకులు ఇర్ఫాన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణేది? అని ఆవేదన వ్యక్తం చేశారు. కుల అహంకారంతో పెట్రేగిపోతున్న వారి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని వార్తలు